iDreamPost
android-app
ios-app

గౌతమ్ హఠాన్మరణం.. ప్రముఖుల దిగ్బ్రాంతి

గౌతమ్ హఠాన్మరణం.. ప్రముఖుల దిగ్బ్రాంతి

ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా షాక్ కి గురయ్యారు. ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉండే మంత్రి మరణవార్త నుంచి రాజకీయ ప్రముఖులు కూడా బయటకురాలేదు. దుబాయి పర్యటనకు పెట్టుబడుల కోసం వెళ్ళిన మంత్రి… నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఆయన నేడు ఉదయం కూడా జిమ్ కు వెళ్లినట్టు తెలిసింది. ఆ తర్వాత కాసేపటికి గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అత్యవసర వైద్య సేవలు అందించినా సరే మంత్రిని వైద్యులు కాపాడలేకపోయారు. ఉన్నత విద్యావంతుడు అయిన మేకపాటి గౌతం రెడ్డి… పరిశ్రమలశాఖను బలోపేతం చేసే దిశగా పలు కీలక అడుగులు వేస్తున్నారు. 2014 లో రాజకీయ ప్రవేశం చేసిన మంత్రి… ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచి… ప్రతిపక్షంలో సమర్ధవంతంగా పనిచేశారు. వివాదాలకు దూరంగా ఉండే ఆయనకు తొలి కేబినేట్ లోనే సిఎం జగన్ కీలక శాఖ అప్పగించి ప్రోత్సహించారు. ఇక ఆయన మరణానికి పోస్ట్ కోవిడ్ సమస్యలే కారణం అనే మాట వినపడుతోంది.

కాగా, ఆయన మరణం తర్వాత… పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చికిత్స పొందిన అపోలో ఆస్పత్రికి పరుగులు తీశారు. తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వెంటనే అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. మీడియాతో కూడా మాట్లాడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. ఇక సిఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తున్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ బయల్దేరి వెళ్ళారు. వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ అపోలో ఆస్పత్రి వద్దనే ఉన్నారు.

తెలంగాణా మంత్రులు… తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి ఆస్పత్రికి హుటాహుటిన వచ్చారు. ఆ తర్వాత జేసీ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కొందరు వచ్చారు. తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొని కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : మంత్రి మేకపాటి గౌతమ్‌ హఠాన్మరణం