iDreamPost
android-app
ios-app

ఉద్దేశం మంచిదే.. మాటలతో సాధ్యమేనా కేటీఆర్..?

ఉద్దేశం మంచిదే.. మాటలతో సాధ్యమేనా కేటీఆర్..?

ప్రభుత్వ విభాగాల్లో నెలకొన్న అవినీతిని నిర్మూలించేందుకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. పురపాలక శాఖలో ఇకపై ఎవరైనా అవినీతికి పాల్పడితే సస్పెండ్‌ చేయడం ఉండదని.. ఏకంగా డిస్మిస్‌ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే నూతన చట్టాలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా పురపాలకశాఖలో తీసుకువస్తున్న టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని తెలిపారు. ఇంత స్పష్టంగా చెప్పాక కూడా ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యoగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో అవినీతి ఏరులై పారుతోంది. డబ్బులు ఇవ్వందే ఏ పని జరగడం లేదు. ఇక ఎక్సైంజ్‌లో అవినీతి దందా అంతా ఇంతా కాదు. ఎమ్మార్పి ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎమ్మార్పికి మించి బాటిల్‌పై క్వాండిటీని బట్టీ 30 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి వ్యవహారాలు రాజకీయ నేతల ప్రమేయం లేకుండా సాగదన్నది నగ్న సత్యం. రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా.. ప్రభుత్వ అధికారుల అవినీతి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు.

అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ముందు రాజకీయ అవినీతికి మూకుతాడు వేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆపై ఇంటిలిజెన్స్‌తోపాటు… ప్రైవేటు నిఘా కూడా పెట్టారని సమాచారం. అందుకే ప్రజా ప్రతినిధులు అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ అవినీతిని కట్టడి చేసిన జగన్‌ సర్కార్‌.. ఆ తర్వాత అధికారులపై దృష్టి పెట్టింది. ఫిర్యాదుల కోసం 14400 టోల్‌ ఫ్రి నంబర్‌ను ఏర్పాటు చేసి.. ఏసీబీ ద్వారా తరచూ దాడులు చేయిస్తోంది.

ఇలా అవినీతి నిర్మూలనకు స్పష్టమైన విధానాలు, ఏర్పాటు చేయకుండా.. అవినీతిని నిర్మూలిస్తాం.. అవినీతికి ప్పాలడితే ఉద్యోగంలో నుంచి పీకేస్తాం.. అంటే ప్రజలు నమ్మరు. పైగా కేవలం పురపాలక శాఖకు మాత్రమే కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేస్తే.. ఇతర శాఖల సంగతేంది. ఏపీలో తీసుకున్నట్లు విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటే.. అవినీతిని తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఇలాంటి ప్రకటనలను రాజకీయంలో భాగంగానే చేశారని ప్రజలనుకుంటారు.