Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో జనాకర్షణ కలిగిన నేతలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వారిలో ఒకరు మంత్రి కొడాలి నాని. నాని ఏమి మాట్లాడినా సెన్సేషనే. అసలు నాని మాట్లాడేదంతా సంచలనమనేలా ఉంటుంది ఆయన తీరు. దూకుడు రాజకీయాలు చేస్తూ, పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల విమర్శలను తిప్పికొట్టడంలో, వారికి తిరిగి చురకలు అంటించడంలో కొడాలి నానిది అందెవేసిన చేయి.
ఇటీవల చంద్రబాబు.. వైఎస్ జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో అసత్యపూరిత విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతా, అందరి తాట తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన కొడాలి నాని.. పత్రికా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మళ్లీ జన్మలో సీఎం కాలేడన్న కొడాలి నాని.. అదే జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అదే చంద్రబాబు సీఎం కాకపోతే.. హైదరాబాద్‌లోని ఇంటికో, లేదా వారి ఊరిలోని ఇంటికో పరిమితం అవుతారా..? అంటూ మీడియా ముఖంగా ఛాలెంజ్ విసిరి, బాబు మళ్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు చెక్ పెట్టారు.
ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలను తిప్పికొట్టే వారిలో కొడాలి నాని ముందు వరసలో ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను నాని తనదైన శైలిలో విమర్శిస్తూ చెడుగుడు ఆడుకుంటుంటారు. తనను విమర్శించే వారిని రాజకీయంగా అణిచివేయాలని చంద్రబాబు యత్నిస్తుంటారని గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అయితే కొడాలి నాని విషయంలో చంద్రబాబు పాచికలు ఏ మాత్రం పారడంలేదు.
Also Read : చంద్రబాబు గెలవడని పెద్దిరెడ్డికి ఎందుకంత కాన్ఫిడెన్స్.. తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం?
వాస్తవంగా కొడాలి నాని రాజకీయ ప్రయాణం టీడీపీతోనే మొదలైంది. 2004లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో రెండోసారి టీడీపీ తరపున గెలిచిన కొడాలి నాని.. వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచారు. జగన్‌తో ములాఖత్ అయిన కొడాలి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి గుడివాడను తనకు కంచుకోటలా మార్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయబావుటా ఎగురవేశారు. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు.
టీడీపీని వీడిన తర్వాత కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. నానిని ఓడిస్తామని ప్రకటనలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు.. గుడివాడలో ఈ సారి బాలకృష్ణ పోటీ చేస్తారంటూ ప్రచారం చేశారు. కొడాలి ఓటమే లక్ష్యంగా కృష్ణా జిల్లా నేతలం పని చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలను కొడాలి నాని గడ్డిపరకతో పోల్చారు. బాలకృష్ణే కాదు.. ఎవరు పోటీ చేసినా.. గుడివాడలో తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.
జగన్ నాయకత్వంపై ఆపారమైన నమ్మకంతో ఉన్న కొడాలి నాని.. 2014లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయినా.. ఆ నమ్మకం కోల్పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తర్వాత.. టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న నేత కొడాలి నానినే. టీడీపీని ధీటుగా ఎదుర్కొంటూ రాజకీయాలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో కొడాలి నాని పాలుపంచుకున్నారు. జగన్ పాలనను, ఆయన ఆలోచనను సునిశితంగా గమనించిన కొడాలి నాని.. 2024 ఎన్నికల్లోనూ వైసీపీదే అధికారమనే గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే మీడియా సాక్షిగా.. చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని, ఒక వేళ అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాననే సవాల్ చేశారని భావించవచ్చు. మరి నాని సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా..? లేక టీడీపీ నేతల చేత ఆవు వ్యాసం లాంటి విమర్శలు చేయిస్తారా..? చూడాలి.
Also Read : కుప్పంపై బాబు ప్రేమ.. వదిలిపెట్టి పోరట..!