Idream media
Idream media
టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ వేడి రగులుతోంది. రాజేందర్ వర్సెస్ అధికార పార్టీ టీఆర్ ఎస్ వ్యవహారంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి హరీశ్ రావు కూడా తాజాగా నోరు విప్పారు. నిజానికి హరీష్ రావు కూడా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారంటూ.. ఈటల ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఏమంటారనే ఉత్సుకత సర్వత్రా ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న హరీశ్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించింది.
టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టే దిశగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈటల రాజీనామాను స్పీకర్ ఆమోదించిన పక్షంలో, ఆరు నెలలలోపు హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న సమయంలో ఉపఎన్నిక నిర్ణీత గడువులోగానే పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంపై ఈటల ముద్రను తుడిచేయడానికి, ఆయన ప్రాభవాన్ని తగ్గించడానికి, ఏకాకిని చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించిన నేపథ్యంలో.. ఆత్మ గౌరవం కాదు, ఆత్మరక్షణ అన్న ట్టుగా ప్రచారం చేయాలని, ఆయన బీజేపీలో చేరడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచన లో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది. రాజీనామా చేస్తున్నట్టుగా ఈటల ప్రకటించిన వెంటనే చోటు చేసుకున్న పరిణామాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.
ఓ వివాహానికి హాజరయ్యేందుకు కరీంనగర్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసిన మరో మంత్రి గంగుల కమలాకర్ కొద్దిసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈటల తన రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి పెరగకుండా నిరోధించడం వంటి అంశాలను చర్చించినట్లు తెలిసింది. ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నెల 11, 12 తేదీల్లో హుజూరా బాద్‌లో పర్యటించాలని నిర్ణయించారు.
హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్
రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందించారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈటల పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని పార్టీలో ఉండాలా.. పోవాలా అన్నది ఆయన ఇష్టమన్నారు. తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫలప్రయత్నమన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని పేర్కొన్నారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని విమర్శించారు. ఈటల పార్టీని వీడినా టీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదన్నారు.
కేసీఆర్ తనకు మార్గదర్శి అని తండ్రి కంటే ఎక్కువని మంత్రి హరీష్ రావు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అంతేకాదు కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే ఉంటానన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అన్నారు. ‘‘తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్య్రానికి నిదర్శనం’’ అంటూ హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ది న్యూస్ అయిన ఈటల విషయంలో హరీష్ ఈ రేంజ్లో స్పందిస్తారని.. ఎవరూ అనుకోకపోవడం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యలపై ఈటల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.