Idream media
Idream media
మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అనంతరం బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ యాక్టివ్ అయ్యారు. కరీంనగర్ జిల్లా రాజకీయాలను ముందుండి నడిపిస్తున్నారు. గతంలో పలు ఆరోపణల మేరకు గంగులను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారన్న వార్తలు వచ్చాయి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అనంతరం ఈటల మాట్లాడుతూ గంగుల కూడా కేసీఆర్ సర్కార్ విధానాలపై అసంతృప్తిగా ఉన్నారని, ఏందన్నా మనల్ని ప్రగతి భవన్ లోపలికి కూడా రానియట్లే.. అని తన వద్ద మదనపడ్డారనే సంకేతాలు ఇచ్చారు. ఆ మరుసటి రోజే లైన్ లోకి వచ్చిన గంగుల.. ఈటలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తనపై పడ్డ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ చెక్కు చెదరకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈటల వెంట టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ వెళ్లకుండా చేయడం ద్వారా అధిష్ఠానం దృష్టిలో పడాలనే తపనతో గంగుల శ్రమిస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు. అధినేత మనసును దోచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ బలాన్ని సమూలంగా పెకిలించి వేసేందుకు గంగుల చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అధినేత నుంచి పుష్కలంగా ఆశీస్సులు ఉండటంతో.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా రాజకీయ నేపథ్యం ఉంటే చాలు.. ఈటలకు వ్యతిరేకంగా తయారు చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. గడిచిన కొద్దిరోజులుగా కరీంనగర్ లో మకాం వేసి గంగుల.. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నేతలకు వల విసరుతున్నారు. వారితో భేటీ అయ్యే ప్రయత్నం చేస్తూ.. ఏ చిన్న అవకాశం లభించినా.. వారికి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమానికి తెర తీస్తున్నారు.
తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈటలను వదిలేసి.. పార్టీ వెంట నడిస్తే.. కలిగే ప్రయోజనాలు ఎంత భారీగా ఉంటాయన్న విషయాన్ని అదే పనిగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే.. తన వద్దకు తీసుకొస్తే.. అందుకు తగిన సొల్యూషన్స్ తాను చూస్తానని మాట ఇస్తున్నట్లు చెబుతున్నారు. చిన్న నేత.. పెద్ద నేత అన్న తేడా లేకుండా ఈటల ప్రాతినిధ్యం వహిస్తునన నియోజకవర్గ పరిధిలోని నేతలు ఎవరైనా సరే.. వారిని తనకు తగ్గట్లు బ్రెయిన్ వాష్ చేయటం.. గులాబీ పార్టీకి ఈటల చేసిన ద్రోహం.. అందుకే ఆయనపై చర్యల్ని పెద్ద సారు తీసుకున్నారంటూ అదే పనిగా వివరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈటలను ఒంటరిని చేయాలన్న తలంపుతో మంత్రి గంగుల చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గంగుల తప్పించే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈటల ఎపిసోడ్ తో గంగుల తన బెర్త్ ఖాయపర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.