Idream media
Idream media
తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోతున్న నారా లోకేష్.. ఒక్క విషయంలో మాత్రం ఆయన తండ్రి చంద్రబాబు వ్యవహార శైలిని బాగా ఒంటబట్టించుకున్నారు. బోడిగుండుకు మోకాలికి ముడివేయడంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. కొద్ది రోజులకు తాము చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపణ అయితే.. మన్నుతిన్న పాములా మిన్నుకుండిపోతారు తప్పా.. ఆ విషయం గురించి ప్రస్తావించరు. కానీ ఈ లోపు తన రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో హైదరాబాద్‌లో ఎవరో వ్యాపారి 10 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే.. అదిగో అది జగనే.. లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టే ఇలా చేశారు.. అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తన హోదాను మరిచీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇలా అనేక విషయాల్లో దేశంలో ఏ మూల ఏది జరిగినా.. దానికి జగన్‌కు ముడిపెట్టి తన అనుకూల మీడియాలో నానా యాగీ చేయించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య,
ఇప్పుడు ఆ విద్యనే ఆయన తనయుడు నారా లోకేష్ బాగా అందిపుచ్చుకున్నట్లుగా ఉన్నారు. తాజాగా చెన్నై సమీపంలో పోలీసులు చేసిన సోదాల్లో ఓ కారులో 5.27 కోట్ల రూపాయలు దొరికాయి. ఆ కారుపై ఒంగోలు, గిద్దలూరు ఎమ్మెల్యేలు అనే స్టిక్కర్లు ఉన్నాయి. ఆ స్టిక్కర్లు.. కలర్ ప్రింట్ తీసుకుని అంటించారు. ఈ రోజు ఉదయం ఈ విషయం మీడియాలో అలా వచ్చిందో లేదో.. ఉదయాన్నే నారా లోకేష్ నిద్ర లేచారు. ట్విట్టర్‌లో యుద్ధం మొదలుపెట్టారు. ‘‘ జగన్ రెడ్డి గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా..?’’ అంటూ ప్రశ్నించారు.
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు సోమలింగం అనే తెలుగు సామెత మాదిరిగా.. ఆ డబ్బు ఎవరిదో ఇంకా పోలీసులు నిర్థారించలేదు. కనీసం పత్రికలు కూడా తమ పరిశోధనా పటిమతో ఆ డబ్బు ఎవరిదో తెలుసుకుని ప్రత్యక్షంగానో, లేక పరోక్షంగానో కూడా రాయలేదు. కానీ లోకేష్ మాత్రం ఆ డబ్బు వైసీపీ ఎమ్మెల్యేలదే అని స్వయం నిర్థారణ చేసి స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాయకుడు బాటలో నడిచే తమ్ముళ్లు.. యథావిధిగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులపై సోషల్ మీడియలో దుష్ప్రచారం మొదలెట్టారు.
అయితే మధ్యాహ్నం కల్లా ఆ డబ్బు వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. ఆ నగదు తనదేనంటూ ఒంగోలుకు చెందిన బంగారు నగల దుకాణం యజమాని నల్లమిల్లి బాలు ప్రకటన చేశారు. తాము చెన్నై నుంచి బంగారం కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే లాక్‌డౌన్ సమయంలో విక్రయాలు జరిపినా కొనుగోళ్లు చేయలేదని తెలిపారు. చెన్నై నుంచి సరుకు కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు ఈ డబ్బు తీసుకెళుతున్నట్లు చెప్పారు. అవసరమైన పత్రాలు చెన్నై ఆదాయపన్ను అధికారులకు అందించి నగదు తెచ్చుకుంటామని ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆ డబ్బు వైసీపీ ప్రజా ప్రతినిధులది.. సాండ్, మద్యం, ల్యాండ్‌లో అక్రమంగా సంపాధించినది.. అంటూ ఆరోపించిన నారా లోకేష్ ఇప్పుడు ఏమి ట్విట్ చేస్తారు..? తాను చేసిన ట్విట్ తప్పని తొలగిస్తారా..? లేక తాను తొందరపడి ఆరోపించానని మరో ట్విట్ పెడతారా..? లేక తన తండ్రి బాటలోనే ఈ విషయంపై ఇక మాట్లాడకుండా మిన్నుకుండిపోతారా..? అనేది చూడాలి.
నారా లోకేష్ ఆరోపించినట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా.. మద్యం, ల్యాండ్, సాండ్‌లో అక్రమంగా సంపాధించే వ్యక్తి అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒంగోలు ప్రజలు గెలిపించేవారే కాదని ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు. తండ్రి బాలినేని వారసత్వాన్ని అందిపుచ్చుకుని కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని 1999, 2004, 2009, 2012 (ఉప ఎన్నికలు) వరుసగా నాలుగు సార్లు ఒంగోలు నుంచి గెలిచారు. 2009లో వైఎస్సార్ హాయంలో గనుల శాఖ మంత్రిగా పని చేశారు. కీలకమైన గనులశాఖ, డబ్బు బాగా సంపాదించుకోవచ్చునుకునే శాఖలో ఉంటూ కూడా ఎనాడు ఒక్క ఆరోపణ లేకుండా బాలినేని పని చేశారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన నాయకుడు కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా తజ్యజించిన ప్రజా నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఓట్ల చీలిక వల్ల 2014లో బాలినేని ఓడిపోయినా.. మళ్లీ 2019లో ఒంగోలు ప్రజలు ఆయన్ను గెలిపించారు. వైఎస్సార్ కేబినెట్‌లోనూ, ఆయన తనయుడు కేబినెట్‌లోనూ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచారు.
Also Read: ఆ డబ్బులు మావే – బంగారపు షాపు యజమాని
రాష్ట్ర రాజధానిగా మంగళగిరి ప్రాంతంలో అమరావతిని ప్రకటించి, సింగపూర్‌లా అభివృద్ధి చేసిన ప్రాంతంలో ముఖ్యమంత్రి కుమారుడుగా తొలిసారి పోటీ చేసిన నారా లోకేష్ ఎందుకు ఓడిపోయారు..? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి పేద రైతుల, దళితుల భూములు కొల్లగొట్టినందుకే ప్రజలు ఓడించారా…? అని నిలదీస్తున్నాయి. ఆరోపణలు వస్తే ఆ విషయంపై మాట్లాడకుండా తాము చెప్పదల్చుకుందే చెప్పడమో లేక సైలెంట్‌గా ఉండిపోవడమో తమ పార్టీ నేతలు చేయడంలేదని, విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ.. ఓటు నోటు కేసును ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తప్పు చేసి తప్పించుకునేందుకు కులాన్ని అడ్డుపెట్టుకోవడంలేదంటున్నాయి.