Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదలు, ప్రాజెక్టులకు జరిగిన నష్టంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన రాజకీయ దుమారానికి దారితీస్తోంది. వరదలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న టీడీపీకి.. తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ఆయుధంగా లభించింది. ఆ ప్రకటనను ఉదహరిస్తూ టీడీపీ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంపై రాజకీయ విమర్శలను మరింతగా ఎక్కుపెడుతోంది. ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు
140 ఏళ్లలో తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో వరద వచ్చిందన్న మంత్రి అనిల్‌కుమార్.. కేంద్ర మంత్రి షెకావత్ సరైన సమాచారం తీసుకోకుండానే అన్నమయ్య ప్రాజెక్టుపై నిరాధారమైన ప్రకటన చేశారన్నారు. ప్రాజెక్టు గేట్ల సామర్థ్యానికి మించి అనూహ్యంగా మూడు లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర జలవనరుల అధికారులు లేదా జిల్లా కలెక్టర్ నుంచి సమాచారం తీసుకోకుండానే షెకావత్ ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రకటనను ఖండిస్తున్నామని అనిల్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వరదలు వచ్చి 150 మంది జలసమాధి అయ్యారని, అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం కావడంతో ఆ నిజాలు దాచే ప్రయత్నాలు చేశారని విమర్శించారు.
రాజ్యసభలో మంత్రి వెనుక కూర్చున్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు టీడీపీ తరఫున ఈ పిట్టకథను వినిపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారు చెప్పిన పిట్ట కథలతో మంత్రి ఆ ప్రకటన చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై నిరాధారమైన ప్రకటనలు పార్లమెంట్‌లో చేయడం సరికాదని హితవు పలికారు. మంత్రి ప్రకటనను పట్టుకుని టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. జల ప్రళయాన్ని కూడా టీడీపీ రాజకీయాలకు వాడుకోవడం ప్రజలు గమనించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read : Central Minister Comments -అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, అసలు వాస్తవాలు