Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సుప్రిం కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆభియోగాలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ వేయాలని సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది.
ఐఆర్ఎస్గా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ అధికారులపై సిబిఐ 2016లో దాడులు చేసింది. ఈ క్రమంలోనే 2017లో సురేశ్, ఆయన భార్య విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో విజయలక్ష్మిని ఏ1గా, సురేశ్ ను ఏ2గా పేర్కొన్నారు.
అయితే ప్రాథమిక దర్యాప్తు లేకుండానే కేసు నమోదు చేశారని మంత్రి సురేశ్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సిబిఐ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో పిటిషన్‌ను ఈ రోజు గురువారం విచారించిన జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. సివిల్ సర్వీసు అధికారులపై కేసు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ప్రాథమిక దర్యాప్తు అనంతరమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. అలా అయితే వాటిని అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించిన ధర్మాసనం.. మళ్లీ ప్రాథమిక దర్యాప్తు జరిపి తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.
2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఓటమి ఎరుగని నేతగా పేరొందారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన ఈ సారి సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : వైఎస్‌కు ముందు… వైఎస్‌కు తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతం