Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు కార్పొరేషన్ సహా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా పెనుగొండ, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట, కమలాపురం, ప్రకాశం జిల్లా దర్శి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లకు 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కాబోతోంది.
హోరాహోరీ ప్రచారం..
ఈ ఏడాది మార్చిలో జరిగిన 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 12 కార్పొరేషన్లను, 74 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను బంపర్ మెజారిటీతో గెలుచుకుంది. టీడీపీ కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని సాధారణ మెజారిటీతో గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ సర్వశక్తులు ఒడ్డినా.. అత్యంత ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రతి మున్సిపాలిటీకి ఇంచార్జులను నియమించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి రోజు వారితో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరో వైపు వైసీపీ దూకుడుగా ప్రజల్లోకి వెళుతోంది. జగన్ సర్కార్ పాలన, సంక్షేమ పథకాలు ఆ పార్టీ విజయానికి జోడు చక్రాలుగా పని చేస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను తామే గెలుస్తామనే ధీమతో వైసీపీ నేతలున్నారు.
Also Read : Kuppam Elections – కుప్పం కోటలో వైసీపీ గెలుపు పక్కా ?
కుప్పం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది..?
అన్ని చోట్లా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. టీడీపీ.. కలిసి వచ్చిన చోట.. జనసేన, బీజేపీ, సీపీఎం పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీలో నిలుచుంది. నెల్లూరులో 8 డివిజన్లు, కుప్పం, దర్శిలలో ఒక్కొక్క వార్డు, గురజాలలో ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అన్ని చోట్లా హోరాహోరీ పోటీ నెలకొంది. అయినా కుప్పం మినహా నెల్లూరు సహా ఇతర మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఫలితాలపై పెద్ద ఆసక్తిలేదు. అధికార పార్టీ సులువుగా ఆయా మున్సిపాలిటీలను కైవసం చే సుకుంటుందనే అంచనాలున్నాయి. ఒక్క కుప్పం ఫలితంపైనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. పాగా వేసేందుకు వైసీపీ, పట్టు నిలుపుకునేందుకు టీడీపీలు హోరాహోరీగా తలపడాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా రాని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేసేందుకు వెళ్లారు. ప్రచారం చివరి రోజున నారా లోకేష్ కుప్పం వార్డుల్లో కలియతిరిగారు. మరో వైపు మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ కుప్పంలోని అన్ని వార్డులను చుట్టేసింది. జగన్‌పాలన, సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారనే ప్రశ్నను ఓటర్ల ముందు ఉంచింది. చంద్రబాబు, నారా లోకేష్‌లు కూడా అధికార పార్టీ బెదిరిపులకు పాల్పడుతోంది.. కుప్పం మా అడ్డా.. అంటూ మాట్లాడారు తప్పితే.. తాను ఈ అభివృద్ధి చేశాను.. ఓటేయండి.. అని మాత్రం చంద్రబాబు, లోకేష్‌లు మాట్లాడలేకపోయారు. ఈ నేపథ్యంలో కుప్పం ఓటర్లు తమ తీర్పును ఎలా ఇవ్వబోతున్నారనే ఆసక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ నెలకొంది. ఒక్క రోజు విరామం తర్వాత ఈ నెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read : Kupam, Lokesh , NTR Fans – లోకేష్ ప్రచారం చేస్తే ఓడించండి.. టీడీపీలో ఎన్టీఆర్ అభిమానుల కలకలం