Idream media
Idream media
ఉత్తరప్రదేశ్‌లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కారుపై దాడి తాలూకు కలకలం ఇంకా రేగుతూనే ఉంది. ఆయనపై జరిగిన దాడికి నిరసనగా హైదరాబాద్‌లోని పాత నగరంలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శనలు చేశారు. చార్మినార్ వద్ద మక్కా మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. మరోవైపు లోక్‌సభలోను, ట్విట్టర్ వేదికగాను దీనిపై విమర్శలు కురిపించారు. దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ‘జడ్’ క్యాటగిరీ భద్రతను అసదుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లోని కిథౌర్‌లో ఎన్నికల సభలో పాల్గొన్న తర్వాత అసద్.. ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో హాపుర్‌లో ఛజర్సీ టోల్‌గేట్ వద్ద ఆయన వాహనంపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ‘జడ్’ క్యాటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనపై శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. తనకు ‘జడ్’ క్యాటగిరీ భద్రత అవసరం లేదని, తానెప్పుడూ ‘ఏ’ క్యాటగిరీ పౌరుడిగానే ఉంటానని అన్నారు.
తన వాహనంపై కాల్పులు జరిపిన వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘పేదలు సురక్షితంగా ఉన్నప్పుడే నేను సురక్షితంగా ఉంటాను. నా కారుపై కాల్పులు జరిపిన వారిని చూసి నేను భయపడను’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఒవైసీపై జరిగిన దాడిని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌టీపీ పార్టీలు ఖండించాయి. ‘‘మీరు సురక్షితంగా బయటపడినందుకు సంతోషంగా ఉంది. మీ వాహనంపై కాల్పులు జరిపిన వారి పిరికి చర్యను ఖండిస్తున్నాను’’ అని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. యూపీ ఎన్నికల్లో మతపరమైన ఉద్రిక్తతలను పెంచేందుకే ఈ దాడి జరిగినట్లు అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడి వెనుక ఉన్న కుట్రదారులను బయటపెట్టాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. ఒవైసీపై జరిగిన దాడిని మైనారిటీలందరిపైనా జరిగిన దాడిగా చూడాలని వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల ట్వీట్ చేశారు.
Also Read : అసద్‌పై కాల్పులు.. కేంద్రం కీలక నిర్ణయం