Idream media
Idream media
1960లో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి రోమ్ నగరానికి పయనమైన భారతజట్టు మీద ఎవరికీ పెద్ద ఆశలేమీ లేకపోయినా రెండు పతకాలు మాత్రం ఖాయమని అభిమానులు, జట్టులోని క్రీడాకారులు, అధికారులు నమ్మారు. మొదటిది 1928నుంచి ప్రపంచ యుద్ధం కారణంగా క్రీడలు జరగని 1940,1944 వదిలేస్తే ప్రతిసారీ ఆనవాయితీగా బంగారు పతకం గెలుస్తూ వచ్చిన హాకీ జట్టు అయితే, మరొక పతకం 400 మీటర్ల పరుగులో మిల్కా సింగ్ నుంచి వస్తుందని అందరికీ గట్టి నమ్మకం.
వరుస విజయాలతో ఒలింపిక్స్ క్రీడలకు
1956లో మొదటిసారి ఒలింపిక్స్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో పాల్గొన్న మిల్కా సింగ్ హీట్స్ లోనే వెనుదిరిగాడు. అయితే అందులో స్వర్ణ పతకం గెలుచుకున్న అమెరికా ఆటగాడు ఛార్లెస్ జెన్కిన్స్ నుంచి విలువైన సూచనలు పొందే అవకాశం లభించింది. మిల్కా సింగ్ తన ఆత్మకథలో ఈ సంగతి ప్రస్తావిస్తూ “బొటాబొటి ఇంగ్లీషులో నేను అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పాడు. వాటిని క్రీడల షెడ్యూల్ ఉన్న పాంఫ్లెట్ మీద నోట్ చేసుకున్నాను” అని రాశాడు.
అయితే 1958లో కటక్ లో జరిగిన జాతీయ క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్లు రెండు అంశాల్లో జాతీయ రికార్డు నెలకొల్పాడు మిల్కా. అదే సంవత్సరం టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆ రెండు అంశాల్లో స్వర్ణం సాధించాడు మిల్కా సింగ్. ఆ సంవత్సరమే ఇంగ్లాండులోని కార్డిఫ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి, ఆ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. మిల్కా ఈ ఘనత సాధించిన మరుసటి రోజు జాతీయ సెలవుదినంగా ప్రకటించారు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.
పోటాపోటీగా సాగిన ఫైనల్
రోమ్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో హీట్స్ లో పెద్ద శ్రమ లేకుండా ఫైనల్ చేరుకున్నాడు మిల్కా ఈసారి. ఆ క్రమంలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తన వ్యక్తిగత రికార్డులో ఒక సెకన్ తగ్గించాడు. సెప్టెంబర్ ఆరున జరిగిన ఫైనల్లో 1958 కామన్వెల్త్ క్రీడల్లో మిల్కా సింగ్ వెనక రజతం సాధించిన సౌతాఫ్రికా క్రీడాకారుడు మాల్కమ్ స్పెన్స్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా ఉండి, అథ్లెటిక్స్ కి మారిన అమెరికన్ ఓటిస్ డేవిస్, పశ్చిమ జర్మనీ క్రీడాకారుడు కార్ల్ ఖాఫ్ మన్ లు మిల్కా సింగ్ కి ప్రధాన పోటీదారులు.
పోటీ ప్రారంభాన్ని సూచిస్తూ రిఫరీ తుపాకీ పేల్చగానే శరవేగంగా పరుగు ప్రారంభించాడు మిల్కా సింగ్. ఓటిస్ డేవిస్, కార్ల్ ఖాఫ్ మన్ లతో కలిసి ముందు భాగంలో దూసుకుపోతున్న మిల్కా సింగ్ రెండు వందల అరవై మీటర్ల తర్వాత తన అంతర్జాతీయ క్రీడాజీవితంలో ఎప్పుడూ చేయని తప్పు చేశాడు. తన వేగాన్ని కొంచెం తగ్గించి, తన వెనక ఎవరున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అని చూశాడు. మిల్కా వెనకే ఉన్న మాల్కమ్ స్పెన్స్ అదే అదనుగా మిల్కాని అందుకున్నాడు.
ఫోటో ఫినిష్
అగ్ర స్థానంలో ఉన్న డేవిస్, ఖాఫ్ మన్ ఒకేసారి, వారి వెనుక ఉన్న స్పెన్స్, మిల్కాలు ఒకేసారి ఫినిషింగ్ లైన్ ని తాకడంతో ఎవరు ఏ స్థానంలో నిలిచారో తేల్చడానికి ఫోటో ఫినిష్ పద్ధతి వాడాల్సి వచ్చింది. మొదటి స్ధానంలో నిలిచిన ఇద్దరూ 44.9 సెకన్లలో రేస్ పూర్తి చేసినట్టు గుర్తించి, డేవిస్ మొదటి స్థానంలో, ఖాఫ్ మన్ రెండవ స్థానంలో నిలిచినట్టు ప్రకటించారు. 45.5 సెకన్లతో స్పెన్స్ కాంస్య పతకం గెలుచుకోగా, సెకనులో పదో వంతు వెనక 45.6 సెకన్లలో ఫినిషింగ్ లైన్ చేరుకున్న మిల్కా సింగ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
మిల్కా సింగ్ పతకం సాధించలేకపోవడానికి తోడుగా ఆ పోటీల్లో హాకీజట్టు ఫైనల్లో 1-0 గోల్స్ తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
చివరి వరకూ మర్చిపోలేని తప్పిదం
రోమ్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగులో 45.6 సెకన్లతో మిల్కా సింగ్ సృష్టించిన రికార్డు మరో భారతీయుడు అధిగమించడానికి నలభై సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వివిధ పోటీల్లో చాలా పతకాలు సాధించినా రోమ్ పోటీలో తను చేసిన తప్పిదం గురించి చివరివరకూ మిల్కా సింగ్ మర్చిపోలేదని ఆయన తనయుడు గోల్ఫ్ ఆటగాడు జీవ్ మిల్కా సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
కరోనా వ్యాధితో పోరాడి 91 సంవత్సరాల వయసులో మరణించిన మిల్కా సింగ్ కి నివాళులు.