iDreamPost
android-app
ios-app

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్లాట్లు : ఛాన్స్ వినియోగించుకుంటున్న మ‌ధ్య త‌ర‌గ‌తి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్లాట్లు : ఛాన్స్ వినియోగించుకుంటున్న మ‌ధ్య త‌ర‌గ‌తి

పేద‌లకు ఇళ్ల స్థ‌లాలు ఇస్తున్నారు.. ఇళ్లు క‌ట్టిస్తున్నారు.. భూమి ధ‌ర‌లు ఆకాన్నంటిన వేళ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల తీరేదెలా..? అని ఆందోళ‌న ప‌డుతున్న వారికి జ‌గన్ స‌ర్కార్ మంచి అవ‌కాశం క‌ల్పించింది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని వసతులతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్ ల‌ను అందుబాటులోకి తెస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి వెబ్ సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప్లాట్ల‌కు తొలిరోజు నుంచే ప్రజల నుంచి మంచి స్పందన వ‌స్తోంది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెబ్‌సైట్‌ ప్రారంభించిన కొద్దిసేపటికే దరఖాస్తులు వచ్చాయని, అనంత‌రం వ‌స్తూనే ఉన్నాయ‌ని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ వీపనగండ్ల రాముడు తెలిపారు. తొలివిడత ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ జిల్లా రాయచోటి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఔట్లలో 150, 200, 240 చదరపు గజాల్లో 3,894 ప్లాట్లను అందుబాటులో ఉంచారు. ఇప్ప‌టికే వేలాది మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడంతోపాటు మొదటి విడతగా 10% ఫీజును చెల్లించారు. సుమారు రెండొంద‌ల మంది మొత్తం ప్లాట్‌ ధరను ఆన్‌లైన్‌లో చెల్లించి 5 శాతం రాయితీ పొందారు. నవులూరు లేఔట్‌లో 200, 240 చ.గజాల్లో 538 ప్లాట్లను అందుబాటులో ఉంచగా.. మొదటిరోజు 210 మంది ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించారు. 17 మంది మొత్తం ప్లాట్‌ ధర చెల్లించారు.

ఇదీ వెబ్‌సైట్

జగనన్న టౌన్‌షిప్స్‌లో ఇంటి స్థలాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నాలుగు వాయిదాల్లో ఒక ఏడాదిలో డబ్బులు చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తైన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తారు.

భరోసాగా ముందుకొస్తున్నారు..

‘‘సంక్రాంతి సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చాం. మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో లాభాపేక్ష లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. జగనన్న టౌన్‌షిప్స్‌లో ప్రతీ లేఅవుట్‌ నిబంధనల మేరకు, క్లియర్‌ టైటిల్‌తో ఉంటుంది. ప్రభుత్వమే ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. భరోసాగా ముందుకొస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక టౌన్‌షిప్‌ ఉండాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌ చేపడతాం. ప్రజలకు మంచి జరుగుతుంటే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.