iDreamPost
iDreamPost
టీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ చేసుకున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. మధ్య తరగతి జీవితాన్ని అత్యంత సహజంగా కొత్త దర్శకుడు వినోద్ అనుతోజు చిత్రీకరించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. డెబ్యూ మూవీ దొరసానితో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న ఆనంద్ దేవరకొండకు ఎట్టకేలకు సక్సెస్ అయితే దక్కింది. అయితే తనకన్నా ఎక్కువగా తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణ, హీరోయిన్ వర్ష బొల్లమతో పాటు స్నేహితుడిగా నటించిన చైతన్యకే ఎక్కువ పేరు రావడం రౌడీ ఫ్యాన్స్ కు షాకింగ్ గా ఉంది. ఇదేంటి హీరో కన్నా ఎక్కువగా వాళ్ళకు క్రెడిట్ వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి స్టేజి ఆర్టిస్ట్ అయిన గోపరాజు రమణ చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాల్లో చిన్న వేషాలు, సీరియల్స్ లో క్యారెక్టర్లు ఇలా నెట్టుకుంటూ వస్తున్నారు. రంగస్థలం అనుభవం ఉండటంతో ఇచ్చిన పాత్రను బాగా పండించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలో ప్రాధాన్యత ఎక్కువ దొరికేసరికి పండగ చేసుకుని పేరు తెచ్చేసుకున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ విడుదలయ్యాక రమణకు సుమారు పది దాకా ఆఫర్లు వచ్చాయని వినికిడి. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళను చూసి చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు గోపరాజు రమణ ఫ్రెష్ గా కనిపించడం చాలా ప్లస్ అయ్యింది. ఆయన టైమింగ్ కూడా దానికి తోడయ్యింది.
ఇక హీరోయిన్ వర్ష బొల్లమకు కూడా ఇదే తరహాలో బడ్జెట్ సినిమాల నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయట. తను కన్నడలో కూడా చేస్తోంది. ఇటీవలే ప్రైమ్ లో వచ్చిన మనే నెంబర్ 13లో కీలక పాత్ర పోషించింది. చూసి చూడంగానే, జాను లాంటి చిత్రాలు చేసినప్పటికీ వర్షకు దీని ద్వారా వచ్చిన గుర్తింపు ఎక్కువ. ఇప్పటికిప్పుడు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ రాదు కానీ ఉన్నంతలో హోమ్లీగా కళ్ళతో కూడా అభినయించగల వర్ష బొల్లమ అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటే మంచి కెరీర్ ని నిర్మించుకోవచ్చు. ఇలా సినిమా హిట్ అయితే హీరోకు బదులు మిగిలిన వాళ్ళు లాభపడటం విశేషమేగా.