Idream media
Idream media
మాస్ట్రో మొదటి సీన్ కుందేలు, కాబేజితోట, దిష్టిబొమ్మ, ఏరియల్ షాట్ చూడగానే అర్థమైంది ఇది కలర్ జిరాక్స్ అని. దర్శకుడు మేర్లపాక గాంధీ మన నమ్మకం. వమ్ము కాకుండా తీసాడు. 70ల కాలంలో SD లాల్ అనే డైరెక్టర్ వుండేవాడు. రీమేక్‌ల స్పెషలిస్ట్ . ఆయన తెలుగు సినిమా చూస్తే హిందీ చూడక్కరలేదు. ఆయన్ని ముద్దుగా సూపర్ డబ్బింగ్ లాల్ అని పిలిచేవాళ్లు. హిందీ సినిమాలో హీరో చెక్స్ షర్ట్ వేస్తే తెలుగులో కూడా అదే. విలన్ అనుచరులకి మీసాలు గడ్డాలు వుంటే తెలుగులో కూడా అంతే. మాస్ట్రోలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. టబు పీతల కూర వండితే , తమన్నా కూడా అదే. ఆటో వెనుక ఐశ్వర్యరాయ్ ఫొటో వుంటే ఇక్కడ కూడా అంతే. సమంతా ఫొటో పెడితే వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే రిస్క్ ఎందుకు?
ఈ కథ గోవాలో జరగడంతో వచ్చే ప్రయోజనమేమీ లేదు. హైదరాబాద్‌లో కూడా జరగచ్చు. సముద్రమే కావాలనుకుంటే వైజాగ్ వుంది. ఎలాగూ తెలుగు కథ కాదు, తెలుగుదనం మాత్రం అవసరమా?
రీమేక్‌లతో సమస్య ఏమంటే జడ్జ్ చేయడం కష్టం. ఎలాగూ ఒరిజినల్ చూసి వుంటాం, దానితో పోలిక వస్తుంది. నారప్పలాంటి ఎమోషనల్ అయితే అదో లెక్క. కొంత అంచనా వేయచ్చు. అంధాదున్ క్రైం మిస్టరీ. కథలోని మలుపులు ముందే తెలిస్తే ఆసక్తి పోతుంది. హిందీ చూడని వాళ్లకి ఇది బానే వుంటుంది.
ఆయుష్మాన్ అంత కాదు కానీ వున్నంతలో నితిన్ ok. రొటిన్‌కి భిన్నంగా వున్నాడు. స్టెప్స్ పాటలు లేవు. ఆ లోటుని End Titlesలో తీర్చుకున్నట్టున్నాడు. అందరి దృష్టి తమన్నాపైనే. టబుని మరిచిపోతే తమన్నా బాగా నటించినట్టే. నభ నటేష్ ఎందుకో చాలా భారంగా ఉంది. అనన్య మంచి నటే కానీ నటించడానికేం లేదు.
ఒరిజినల్‌లో కూడా సెకెండాఫ్ సాగతీత, తెలుగులో కూడా అంతే. లాజికల్‌గా ఆలోచిస్తే ముసలావిడ డిసౌ కంటే హీరోనే ప్రమాదకారి. వృద్ధురాలు, తికమకగా మాట్లాడే ఆమె సాక్ష్యం చెల్లదు. ఆమెని ఈజీగా తమన్నా ఫినిష్ చేస్తుంది. ఆమె దృష్టిలో గుడ్డివాడుగా నటించే హీరోనే డేంజర్. అతన్ని చంపకుండా వదిలేస్తుంది. కథ నడవాలి కదా! ఒరిజినల్‌లోనే ఈ లోపముంది.
యువరాజ్ ఫొటోగ్రఫీ బావుంది. మూలంలోని ట్యూన్స్ జోలికి వెళ్లకుండా నేపథ్య సంగీతం కూడా సొంతంగా మహతిస్వరసాగర్ .అందించారు. ముసలావిడని పైనుంచి తోసే సన్నివేశంలో మొజార్ట్ బిట్‌ని హిందీలో వాడారు. ఆ సీన్‌కి చాలా డెప్త్ తెచ్చింది సంగీతం. తెలుగులో ఆ ఫీల్ పోగొట్టారు. కాపీ కొట్టాల్సినపుడు కొట్టాలి. సందేహపడకూడదు.
డైలాగులు కూడా అనువాదం కాబట్టి గాంధీ ముద్ర కనబడదు. మేర్లపాక గాంధీ కామెడీపై పట్టున్న దర్శకుడు. కృష్ణార్జునయుద్ధం థియేటర్‌లో ఆడకపోయినా టీవీలో కొన్ని వందలసార్లు వచ్చి అందర్నీ నవ్విస్తోంది. ఒక దశలో జంధ్యాల లేని లోటు తీరుస్తాడనుకున్నారు. ఇపుడు ఈ సినిమాతో SD లాల్ లేని లోటు తీర్చాడు. ఇది OTTలో రావడం నిర్మాతల అదృష్టమే కాదు, మనది కూడా.
Also Read : దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు.. ఒకరి తర్వాత ఒకరు!