Idream media
Idream media
సెక్స్ అపోహలపై వల్గారిటీ లేకుండా తీయడం కష్టం. దాన్ని సాధించి చూపించారు మేర్లపాక గాంధీ, కార్తీక్ రాపోలు. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ఏక్‌మినీ కథ ఈ రోజు (గురువారం) అమెజాన్ ఫ్రైమ్‌లో రిలీజయింది.
సైకాలజీ, దాంపత్య సమస్యల్ని మిళితం చేసిన సినిమాలు మనకి బాగా తక్కువ. కారణం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి రారనే భయం. అది నిజం కూడా. ఎదిగిన పిల్లల మధ్య ఈ రకం సినిమాలు చూడడం మనకి అలవాటు లేదు. ఒక రకంగా సినిమా కథ కూడా ఇదే. పిల్లలు చిన్నప్పుడు అడిగే సందేహాలని పెద్దవాళ్లు అర్థం చేసుకుని తీరిస్తే సమస్య వుండదు. అయితే అసలు సమస్య ఏమంటే పిల్లలతో ఇలాంటివి చెప్పడం మనం బూతుగా భావిస్తాం.
ఇపుడైతే ఇంటెర్నెట్ వుంది. దాంతో ప్రమాదం కూడా వుంది. ఒకప్పుడు భయాలు, సందేహాలు వస్తే తీర్చేవాళ్లు లేరు. కొంత మంది దొంగ డాక్టర్లు సెక్స్ స్పెషలిస్ట్‌లుగా పేపర్‌లో చిన్న ప్రకటన ఇచ్చేవాళ్లు. వాళ్లు వూరూరూ క్యాంప్‌లు పెట్టేవాళ్లు. హోటల్‌లో ఒక పర్మనెంట్ రూంలో మకాం. వాళ్లని కలిస్తే వున్న భయానికి కొత్త భయాలు సృష్టించి డబ్బులు గుంజేసేవాళ్లు. కరెంట్ ట్రీట్‌మెంట్ కూడా ఇచ్చేవాళ్లు. వీళ్లు కాకుండా రోడ్డు పక్కన చిన్నడేరా వేసుకుని మూలికా వైద్యులు. పగలంతా వీళ్లు ఖాళీ. రాత్రిపూట వాళ్లకి పేషెంట్ల రద్దీ. కారణం ఎవరైనా చూస్తారనే భయం.
పెద్దవాళ్లు పెళ్లి చేసేటపుడు అందం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి చూస్తారు కానీ దాంపత్యానికి పనికొస్తాడా లేదా చూడరు. వాడి మైండ్‌లో ఎన్ని రకాల చెత్త వుందో తెలుసుకునే అవకాశం లేదు. ఫలితం గొడవలు, విడాకులు. 40 ఏళ్ల క్రితం వింత కథ, మా బంగారక్క, అందమే ఆనందం (ఫ్రిజిడిటి కథలు) వచ్చాయి. జనానికి ఎక్కలేదు. తరువాత అడల్ట్ కంటెంట్ మీద వచ్చిన సినిమాలన్నీ ఎక్కువ భాగం పచ్చిబూతే.
హిందీలో కొత్త కథలు రావడం మొదలై చాలా ఏళ్లయింది. టాయిలెట్, ప్యాడ్‌మ్యాన్, పింక్, బాల్ ఇవన్నీఅంతకు ముందు ఎవరూ టచ్ చేయనివి. సెక్స్ సమస్యపై శుభ్‌మంగళ్ సావధన్ వచ్చింది. బాగానే ఆడింది. తెలుగులో కూడా కొత్త కథలు మొదలయ్యాయి. అయితే ఇది కత్తిమీద సాము. తేడా వస్తే మునిగిపోతారు.
మేర్లపాక గాంధీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంటేనే కామెడీ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్. రెండు వరుస హిట్స్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా) తరువాత కృష్ణార్జునయుద్ధం తీశాడు. దీంట్లో కూడా కామెడీ వుంది కానీ, నానీకి యాక్షన్ హీరో కావాలనే కోరిక, గాంధీకి కూడా యాక్షన్ డైరెక్టర్ అయిపోవాలని కోరిక కలగలిసి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఇద్దరు హీరోలు, హీరోయిన్లు కన్ఫ్యూజ్ చేశారు. అందుకే ఈ సారి యాక్షన్ కాకుండా, కామెడీని నమ్ముకున్నాడు. అదే అతని బలం కూడా. కొత్త డైరెక్టర్ కార్తీక్‌ని (గాంధీ టీం సభ్యుడు) దర్శకుడిగా పెట్టి గాంధీ Back groundలో వున్నాడు. కార్తీక్ సత్తా నిరూపించుకున్నాడు.
సింఫుల్‌గా కథ గురించి చెప్పాలంటే హీరోకి చిన్నప్పటి నుంచి తనకి సైజ్ చిన్నదని. ఈ భయంతోనే పెరుగుతాడు. పెళ్లి చేసుకుంటే భార్యని సంతృప్తి పరచలేనని భయం. దీనికి పరిష్కారం వెతికే క్రమంలో రకరకాలుగా ఇరుక్కుపోతూ వుంటాడు. ఇది తండ్రి బ్రహ్మాజీకి అర్థం కాక కొడుకుని సెక్స్ మానియక్ అనుకుని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళతాడు. అక్కడ హీరో ప్లాష్‌బ్యాక్ చెప్పడంతో కథ ప్రారంభం.
హీరో తన బాధల్లో వుండగా హీరోయిన్ (కావ్య) పరిచయం. పెళ్లి ఫిక్స్ కావడం. దాన్ని ఎలాగైనా వాయిదా వేయించాలని చూస్తాడు. కుదరదు. ఫస్ట్ నైట్‌ని హీరో తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. మరింతగా ఇరుక్కుపోవడం. మామూలుగా OTTలో వచ్చే సినిమాల్లో కొన్ని పాత్రల మధ్య కథ నడుస్తూ అక్కడక్కడే తిరుగుతూ బోర్ కొడుతుంది. దీంట్లో అనేక కొత్త పాత్రలు వచ్చి కామెడీ సృష్టిస్తుంటాయి. సుదర్శన్ తన టైమింగ్‌తో అదరగొట్టాడు. బ్రహ్మాజీ, పోసాని గురించి చెప్పాల్సిన పనిలేదు.
హీరో అయిపోవాలని అనవసరంగా తెరమరుగైపోయిన సప్తగిరి కాసేపు కనిపించినా భలే రిలీఫ్. చివరికి కథ ఎలా సుఖాంతమైందంటే చేతిలో ఫోన్ వుందిగా చూసేయండి. టైం వేస్ట్ కాదు.కరోనా కాలంలో రెండు గంటల సేపు నవ్వించారు. చాలాసార్లు పగలబడి, కొన్నిసార్లు చిన్న నవ్వులు. ఈ సినిమా మీద నమ్మకంతో థియేటర్ రిలీజ్ కోసం యువి వాళ్లు ఇంత కాలం ఎదురు చూశారు. చివరికి OTT తప్పలేదు. బ్రహ్మాండమైన లాభానికి అమ్మినట్టు టాక్.
కామెడీ సేఫ్ జానర్. కార్తీక్ జర్నీలో దీన్ని నమ్ముకుంటే సేఫ్. మొన్న సినిమా బండి ప్రవీణ్, ఈ రోజు కార్తీక్ రాపోలు. కొత్త వాళ్లకి ఇండస్ట్రీ తలుపులు తెరవకపోతే , బద్దలు కొట్టుకుని వచ్చేస్తారు.
మొత్తానికి మేర్లపాక గాంధీ is back.
హీరో శోభన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ టైప్ కామెడీ హీరో అవుతాడు. ఆ ఎరినాలో చాలా గ్యాప్ వుంది.