iDreamPost
android-app
ios-app

మిగిలిన ఐదుగురూ జంప్‌.. మేఘాల‌యలో కాంగ్రెస్ ఖాళీ..!

మిగిలిన ఐదుగురూ జంప్‌.. మేఘాల‌యలో కాంగ్రెస్ ఖాళీ..!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఓ వైపు కాంగ్రెస్ పోరాడుతుంటే.. మ‌రోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ గ‌ల్లంత‌వుతోంది. కొన్నిచోట్ల అంత‌ర్గ‌త విభేదాల‌తో కొట్టుమిట్టాడుతోంది. మ‌రికొన్ని చోట్ల హ‌స్తం గుర్తుపై గెలిచిన వారే హ్యాండిస్తున్నారు. ఈ పార్టీలో భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావిస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో మొత్తం పార్టీయే ఖాళీ అవుతోంది. తాజాగా మేఘాలయ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడింది.

నాగాలాండ్, త్రిపుర సహా మేఘాలయలో వ‌చ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం అధిష్ఠానం ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ ముగియ‌గానే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల‌పై దృష్టి పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలో మేఘాల‌యాలో కాంగ్రెస్ కు గ‌ట్టి దెబ్బే త‌గిలింది. ఆ రాష్ట్రంలో మొత్తం అర‌వై సీట్లు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో 21 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. కొన్నాళ్ల‌కే ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి హ్యాండిచ్చారు. మిగిలిన 17 మంది ఎమ్మెల్యేలలో ఒకేసారి 12 మంది సభ్యులు రాత్రికి రాత్రే గ‌తేడాది న‌వంబ‌ర్ లో టీఎంసీలోకి జంప్ అయ్యారు. దీంతో అక్క‌డ టీఎంసీ యే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. తాజాగా వారు కూడా బీజేపీ భాగస్వామిగా ఉన్న అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్‌లో (ఎండీఏ) చేరిపోయారు. నేరుగా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మాను కలిసి తామంతా కూటమి ప్రభుత్వంలో లాంఛనంగా చేరినట్టు ఒక లేఖను సమర్పించారు. వీరికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ”ప్రభుత్వం, ప్రభుత్వ విధానాల పటిష్టతకు మీతోనూ, ఎండిఏ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలు సాకారమవుతాయని విశ్వసిస్తున్నాం” అని ఐదుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మెమొరాండంను సీఎంకు సమర్పించారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంప‌రీన్ లింగ్డో, మేర‌ల్‌బోర్న్ స‌యీమ్‌, మ‌హేంద్రో ర‌ప్సంగ్‌, కింఫా మార్బానియంగ్‌, పీటీ సాక్మీ.. ప్ర‌క‌టించారు.

Also Read : ఐదింట్లో మూడు రాష్ట్రాల్లో హంగేనట..!