మెగా మంచుల మధ్య ‘టచింగ్’ బ్రోమాన్స్

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య ఉండే స్వీట్ ఫ్రెండ్ షిప్ గురించి ఇండస్ట్రీకే కాదు ప్రేక్షకులకు సైతం తెలిసిన విషయమే. స్టేజి మీద ఓసారి మాటలు అనేసుకోవడం ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రాణ స్నేహితుల్లా ఒకరిమీద మరొకరు ప్రేమ చూపించడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు ట్విట్టర్ వేదికగా దీన్ని వాడుకుంటున్నారు. చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన సందర్భంగా మోహన్ బాబు వెల్కం మిత్రమా అని ట్వీట్ చేశారు. దానికి బదులిచ్చిన చిరు రాననుకున్నవా రాలేననుకున్నావా అంటూ ఇంద్ర స్టైల్ లో మాంచి రిప్లై వదిలారు. 

సరే ఊరికే ఉంటే ఆయన డైలాగ్ కింగ్ ఎందుకు అవుతారు. తనదైన శైలిలో ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతా అంటూ ఆ మధ్య వెనుక నుంచి చిరంజీవి తనను కౌగిలించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ బదులిచ్చారు. దీంతో భలే సమాధానం అని అందరూ అనుకున్నారు. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలే షూటింగ్ లేక సరైన టైంలో సోషల్ మీడియాలో అడుగు పెట్టిన బాస్ అందరికి ధీటుగానే బదులు ఇస్తున్నారు. మిత్రమా కోరనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి, షేక్ హాండ్స్ వద్దు, హగ్స్ వద్దు, నమస్కారమే ముద్దు, ఇంకా అవగాహన కావాలంటే మనకు బాగా కావాల్సిన అమ్మాయి లక్ష్మి ప్రసన్న చేసిన వీడియో ఉంది చూడమంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. 

ఇంకేముంది అభిమానులు కామెంట్స్ లో ఏం టైమింగ్ బాసూ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మొత్తానికి మెగా స్టార్ మంచు కింగ్ ల మధ్య ఆన్ లైన్ బ్రోమాన్స్ ఓ రేంజ్ లో పేలుతోంది. ఒకప్పుడు ఎన్నో సినిమాలు హీరో విలన్ గా చేసిన ఈ కాంబినేషన్ 199౦లో వచ్చిన కొదమసింహం తర్వాత మళ్ళి రిపీట్ కాలేదు. మోహన్ బాబు సోలో హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్నాక విలన్ వేషాలకు స్వస్తి చెప్పేశారు. ఆ రకంగా మళ్ళి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దొరకలేదు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు కాని అది నెరవేరడం లేదు. పోనీలే ఇలా ఆన్ లైన్ వేదిక రూపంలోనైనా ఇద్దరూ తమ బాండింగ్ ని చాటుకుంటున్నారు.  

Show comments