iDreamPost
iDreamPost
దేశంలోని వైద్య విభాగంలో జరిగే తతంగం, ఇక్కడ ఉండే వ్యాపార ధోరణలను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని దేశాల్లో నిషేధించిన మందులు కూడా ఇక్కడ కౌంటర్‌సేల్ రూపంలోనే విచ్చలవిడిగా సామాన్యులకు దొరికేస్తుంటాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఈ కౌంటర్‌సేల్స్ విధానం కారణంగా కొన్ని రకాల రోగాలు మందులకు లొంగకుండా మారిపోతున్నాయన్నది భయపెట్టే వాస్తవం.
క్వాలిఫైడ్ వైద్యులు మాత్రమే రాసే కొన్నిరకాల మందుల చీటీ కూడా లేకుండా ఆయా షాపుల వద్ద అమ్మకాలు సాగిస్తుంటారు. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మందులను అమ్మడమే ‘కౌంటర్‌సేల్’గా చెబుతారు. ఇక్కడ అదీ ఇదీ అని లేదు యంఎస్ జనరల్ సర్జన్ వాడేందుకు కూడా వెనకాడే కొన్ని రకాల ఇంజక్షన్లు, టాబ్లెట్లు కౌంటర్‌సేల్‌లో భాగంగా ప్రజల వద్దకు చేరుతున్నాయి.
ఇలా విచ్చలవిడిగా ఈ మందులను వాడడం వల్ల, తీరా ఆరోగ్య సమస్య వచ్చాక ఈ మందులు పనిచేయడం లేదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ముందుగా వాడేసిన వాటికంటే ఎక్కువ పవర్ ఉన్న మందులను వినియోగించాల్సి వస్తోంది. ఇటువంటి సమయంలో ఒక్కోసారి శరీరం వైద్యానికి సహకరించొచ్చు, సహకరించకపోవచ్చు. ఇదంతా విచ్చలవిడిగా మందుల షాపుల వద్ద కొనుక్కుని మింగేసిన మందుల ఫలితమేనని సదరు వ్యక్తులకు కూడా అర్ధం కాని విషయంగానే మిగిలిపోతుంది.
ఇప్పుడు కరోనా విషయంలోనూ ఈ కౌంటర్‌సేల్ తన ప్రతాపాన్ని చూపుతోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ల ద్వారా టెస్టులు చేయించుకుని, కరోనా నివారణకు వాడే మందులను మందుల షాపుల ద్వారా పొంది వినియోగిస్తున్నవారు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. అయితే ఇక్కడ ఎదురయ్యే సమస్య ఏంటంటే కరోనా చికిత్సలో వినియోగించే పలు రకాల మందులు నిపుణుల సమక్షంలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. రోగి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ మందులు వావచ్చా? లేదా? అనేది వైద్యుడు నిర్ధారిస్తాడు. కానీ కౌంటర్ సేల్ విధానంలో ఈ మందులు పొందడం వల్ల అటువంటి పరిశీలనకు అవకాశం ఉండడం లేదు. ఇది చివరగా వ్యక్తుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావానికి కారణమవుతోంది.
వ్యాధి వచ్చినప్పుడు వాడాల్సిన మందులు, తగిన పరిమాణంలో వాడకపోయినా, ముందుగానే వాడేసినా కూడా ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు తప్పవు. అంతే కాకుండా రెండుమూడు రకాల మందులను కలిపి తీసుకునే సమయంలో ఆ కాంబినేషన్స్ ఏమైనా తేడా వస్తే ప్రాణాలకు సైతం ముప్పు తప్పకపోవచ్చు. ఉదాహరణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ టాబ్లెట్లు రెండూ కలిపి ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దని, దీని కారణంగా గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటుగా ఆయా మందులను కొనుక్కుని విచ్చలవిడిగా కొందరు వాడేస్తున్నట్లు చెబుతున్నారు.
కరోనా పట్ల సామాజికంగా ఎదురవుతున్న చిన్నచూపు కూడా ఈ కౌంటర్‌సేల్‌ను ప్రోత్సహిస్తోందన్న వాదన కూడా ఉంది. తమకు వ్యాధి ఉందని తెలిస్తే సమాజంలో ఎదురవుతున్న చిన్నచూపునకు భయపడి కొందరు తమకు తెలిసిన వారి ద్వారా టాబ్లెట్లు తీసుకుని వాడేసి, బైట తిరిగేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పద్దతి వల్ల తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడంతో పాటు, తమ చుట్టు ఉన్నవారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
కరోనా వచ్చిన మొదట్లో జలుబు, జ్వరం, దగ్గు మందుల కోసం ఎవరైనా మందుల షాపుల వద్దకు వస్తే వారి వివరాలను ఆయా గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసారు. రాన్రాను వాటిని పక్కన పడేసారు. దీంతో తమ ఆదాయం కోసమో, తెలిసిన వారన్న మొహమాటం వల్లనో మందుల వ్యాపారులు ఈ కౌంటర్‌సేల్‌ను కొనసాగిస్తున్నారు. దీనిని అరికట్టకపోతే కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తున్నప్పుడు వ్యక్తుల ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు, సమాజంలో కూడా విపరీత పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.