Idream media
Idream media
ఈ నెల 2న ఉస్మానియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు వైద్యులు అస్వస్థతకు గురయ్యారు. జనరల్ మెడిసిన్, బయోకెమెస్ట్రీ విభాగాలకు చెందిన వారికి వ్యాక్సిన్ వేసిన అనంతరం బీపీ పెరిగింది. వెంటనే ప్రత్యేక చికిత్సలు అందించారు. రెండు గంటల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఆ సంఘటన ఆస్పత్రిలోని ఇతర సిబ్బందిలో ఆందోళన కలిగించింది. ఫలితంగా కొంత మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
మరో ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్న ఏఎన్ఎంకు కళ్లు తిరిగాయి. వైద్యులు ఆమెను కాసేపు విశ్రాంతి తీసుకోమ్మని పరిశీలించారు. కాసేపటికి ఆమె సద్దుకున్నారు. నార్మల్ అయ్యారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎక్కడో అక్కడ చిన్న చిన్న దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ వాటి ప్రభావం ఇతరులపై పడుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంత మంది వైద్య సిబ్బంది ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులు వారికి ఎంతలా అవగాహన కలిగించినా, ప్రభుత్వాధినేతలు భరోసా కల్పించినా రకరకాల సాకులు చెప్పి వ్యాక్సిన్ వేయించుకోకుండా తప్పించుకుంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కరోనా మందు వచ్చేసింది. వ్యాక్సినేషన్ చకచకా జరుగుతోంది కూడా. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేస్తున్నారు. టీకాను అయితే త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం దానిపై పూర్తి భరోసా కలిగించడంలో విఫలమైంది. వ్యాక్సిన్ వల్ల కలిగే పరిణామాలపై ముందస్తుగా అవగాహన కలిగించని కారణంగా కొంత మంది వైద్య సిబ్బంది సైతం వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. తర్వాత చూద్దామంటూ తప్పించుకుంటున్నారు. దాదాపు 20 శాతం మంది వరకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని ఉన్నతాధికారులే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి ఆరు వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా రోజుకు 600 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ వేసుకోవాలని ఒకటికి పదిసార్లు అధికారులు వైద్య సిబ్బందికి చెప్పారు. కానీ దాదాపు 1200 మంది వరకూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్ట పడడం లేదు.
ఎర్రగడ్డలోని చాతీ వ్యాధుల ఆస్పత్రిలో మొత్తం 520 మంది సిబ్బంది ఉండగా వారిలో ఇప్పటివరకు 300 మంది మాత్రమే వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఇంకా 220 మంది టీకాలు వేసుకోవడానికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. వారికి వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. చెస్ట్ ఆస్పత్రిలో కొందరికి హోమ్ క్వారంటైన్ ఇంకా పూర్తి కాలేదని, మరికొందరు గర్భిణులు ఉన్నారని, ఇంకొందరిలో బాలింతలున్నారని, కొందరికి చర్మ వ్యాధి సమస్యలున్నాయని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోపారామెడికల్, శానిటేషన్ సిబ్బంది, వైద్యులు అందరూ కలిపి 363 మంది ఉండగా అందులో కేవలం 180 మంది మాత్రమే తీసుకున్నారు. మిగతా వారికి అవగాహన కల్పించినప్పటికీ తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా శంకర్ తెలిపారు.
వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు వస్తాయోమోనని వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే సిబ్బందే వెనుకడుగు వేస్తే.. మరి సామాన్యులు ముందుకు వస్తారా..? అనేది ప్రస్తుతం ఉన్నతాధికారులకు అనుమానంగా మారింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. వ్యాక్సిన్ పై పూర్తి అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మందిలో ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినంత మాత్రాన దీనిపై అనుమానించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అన్ని రకాల పరీక్షలు, ట్రయల్స్ పూర్తి అయిన తర్వాతే వ్యాక్సినేషన్ ప్రారంభించారని భరోసా ఇస్తున్నారు. మరి సామాన్యులు ఎంత వరకు ముందుకు వస్తారో.. చూడాలి.