iDreamPost
android-app
ios-app

మీడియా – మేలిమి వ్యాపారం

  • Published Feb 22, 2020 | 5:15 AM Updated Updated Feb 22, 2020 | 5:15 AM
మీడియా – మేలిమి వ్యాపారం

“విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు,” అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. “రాజధాని గుండె పగిలింది” అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. “రాజధాని అక్రమాలపై సిట్” అంటూ మరో పత్రిక. ఇళ్ళ స్థలాల కోసం “అస్సైన్డ్” భూములు గుంజుకుంటున్న వైనం పై “రాత్రికి రాత్రే దున్నేశారు” అంటూ ఒక పంటపొలం ధ్వంసం చేసిన తీరు ఇంకో పత్రికలో ప్రత్యేక కథనం.

ఈ కథనాలపై సోషల్ మీడియాలో పోస్టుల వైరల్ అవుతాయి. ఎవరి రాజకీయ విధానం మేరకు వారు ఈ వార్తలపై, ప్రత్యేక కథనాలపై పోస్టుల యుద్ధం చేస్తారు. ఈ క్రమంలో తప్పు ఎక్కడ జరుగుతోంది, నిజమేది, అబద్దమేది, సరిదిద్దాల్సిందేది అనే అంశాలు మర్చిపోతాం. అయినా మీడియాలో వార్తలు చూసేటప్పుడు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు తెలుసుకునేటప్పుడు మనం ఎటువైపు అన్నదానిపైనే ఆ సంఘటలను, వాటిపై వార్తలు అర్ధం అవుతాయి.

అధికార యంత్రంగా (బ్యూరోక్రసీ) ప్రజలను ఎప్పుడో వదిలేసింది. అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండడం వదిలేసి ప్రజలపై పెత్తనం చేసే పాలకులుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళకు “టార్గెట్ రీచ్” అవడమే ప్రధానం. అందుకోసం అధికారులు ఏమైనా చేస్తారు? ఏమీ చేయకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఇళ్ళస్థలాలు. ఈ “టార్గెట్” లో అగ్రభాగాన ఏ జిల్లా ఉంటుందో, ఏ అధికారి ఉంటారో అన్నదే ప్రశ్న. అందుకోసమే కనిపించిన భూమి ఈ “టార్గెట్” వలలో చిక్కుకుంటోంది. అందుకే బడుగు జీవుల అస్సైన్డ్ భూములు స్వాహా అవుతున్నాయి.

ఇప్పుడు రైతులు, రైతు కూలీలు, వారి సమస్యలే మీడియా ఎజెండాగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం హర్షించతగ్గదే అయినా ఇలాంటి వార్తలు మీడియా మర్చిపోయి ఎన్నో యేళ్ళయింది. ఇప్పుడు కూడా కేవలం రాజకీయమే ఈ అంశాలను మీడియాకు ఎజెండాగా తెచ్చాయి.

మీడియా విశ్వసనీయతపై ఆంగ్లపత్రికలోని వ్యాసంలో ఆవేదన కనిపించింది. అయితే మీడియా ఒక “బాధ్యత”గా కాకుండా “మేలిమి వ్యాపారం”గా మారినప్పుడు విలువలెలా ఉంటాయి? వ్యాపారంలో “లాభ నష్టాలే” కానీ బాధ్యతలు ఎక్కడ ఉంటాయి? వ్యాపారంలో రాజకీయం జోడించినప్పుడు ఇక విశ్వసనీయత ఎలా ఉంటుంది? అన్నవి ప్రశ్నలే.

“రాజధాని గుండె పగిలింది” అంటేఎన్ని పేజీలు రాసినా, ఎన్ని రోజులు రాసినా అవి “రాజధాని” సమస్యలే కానీ ప్రజల సమస్యలుగా మారతాయా? “రైతుల గుండె పగిలింది”, “దిక్కుతోచని కౌలు రైతులు”, “పస్తులుంటున్న, వలసలు వెళుతున్న రైతు కూలీలు” అనే వార్తలు ఈ ప్రాంతంనుండి భూసమీకరణ సమయంలో వినిపించలేదేం? “రాత్రికి రాత్రే దున్నేసిన పొలాలు” అప్పట్లో ఇక్కడ కనిపించలేదేం! పొలంలో కరెంటు మోటార్లు రిపేర్ చేస్తూ బతికే బడుగుజీవి ఏమయ్యాడో అనే కథనాలేవి? ట్రాక్టరు డ్రైవర్ ఏమయ్యాడు? పాలేరు ఏమయ్యాడు? వాళ్ళ కుటుంబాలు ఏమయ్యాయి? వాళ్ళకు గుండెలు ఉండవా? అవి పగలవా? ఈ ప్రశ్నలే కదా విశ్వసనీయత నిలిపేది?

వాస్తవానికి ఈ ప్రాంత “రైతులు” ఇక్కడ భూములు అమ్ముకొని పల్నాడు వైపు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, కంభం వైపు భూములు కొని వ్యవసాయం మొదలు పెట్టారు. ఇక్కడ కౌలు రైతులు తెనాలి వైపు తరలి వెళ్ళారు. వారితో పాటు రైతు కూలీలు, ట్రాక్టరు డ్రైవర్లు, పాలేర్లు తెనాలి, దుగ్గిరాల వైపు వెళ్ళారు.

ఆ గుండెలు ఆగవు. ఆ చేతులు ఆగవు. మట్టికి ఆ మనుషులకు విడదీయరాని బంధం ఉంటుంది. అందుకే ఆ గుండెలు మట్టిని వెతుక్కుంటూ మరో చోటికి వెళ్ళాయి.