iDreamPost
iDreamPost
ఆగండి.. ఆగండి.. స్టార్టింగ్ చూసి రాత్రి ఏడు తరువాత రాష్ట్రంలో దొరకని మందు గురించి కాదండీ బాబు అడుగుతుంది. ఉన్నదున్నట్లు అర్ధం కాకపోవడానికి, నిజాన్ని మినహాయించి.. తాము అనుకున్నదే నిజమని పాఠకుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి వారి వ్యాధి తగ్గే మందు కావాలని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే మీడియా రంగంలో గత కొన్నేళ్ళుగా పెత్తనం సాగించే వర్గాలు తమ కంటితోనే ప్రజలు చూసే విధంగా హిప్నటైజ్ చేయడం ఇప్పటికే ప్రజలు గుర్తించారు. అందుకే ప్రత్యామ్నాయంగా వచ్చిన మీడియా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు కూడా.
అయినప్పటికీ ప్రజలు తమ కళ్ళతోనే ఇంకా చూస్తున్నారన్న మిథ్యలో బ్రతుకుతున్న కొందరు స్వయం ప్రకటిత మేథావులు ఇప్పటికీ ‘రాతలు’ మార్చుకోవడం లేదు. ఎడిటోరియల్ పేజీ, దాని పక్కనే తమతమ నిశ్చితాభిప్రాయాలు వ్యక్తం చేసే పెద్దల భావనలకు ఎంతో విలువ ఉంటుంది. ఒక స్థాయి పాఠకులు తప్పని సరిగా ఆ పేజీలను చదువుతారు. అయితే అదే స్థానంలో పూర్తి పక్షపాతంతో రాసే రాతల వల్ల ఆ పేజీకి, ఆ స్థానానికి విలువను తగ్గించేస్తున్నారన్న వాదన ఇప్పటికే బలంగా ప్రజల్లో ఉంది. అనుకూలపక్షం, వ్యతిరేక పక్షాల పట్ల ఆ పేజీలో రాసే రాతలను గమనించే పాఠకులకు తేడా సుస్పష్టం గుర్తిస్తున్నారు. దీంతో సదరు మీడియా తన విలువను తానే కోల్పోతోంది.
ఇటీవలే రీడర్‌షిప్ సర్వేలో కూడా అటువంటి మీడియా సంస్థల రీడర్స్ ఏ స్థాయిలో తగ్గారో కూడా అంకెల సాక్షిగా ప్రకటించడం కూడా జరిగింది. సద్విమర్శ ఎప్పుడు వార్త విలువను, రాసేవారి గౌరవాన్ని పెంచుతుంది. ఈ సత్యం ఈనాటిది కాదు.. ‘న్యూస్’ పుట్టబడినప్పటినుంచే అనుభవంలోకొచ్చిందే.
న్యాయ వ్యవస్థ పనితీరు గురించి కావొచ్చు, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, ప్రజల కష్టనష్టాలు, రాష్ట్రాల ప్రగతి.. ఇలా ఏ విషయంలోనైనా అనుకూలపక్షం ఉంటే ఒక రాత, అననుకూల పక్షముంటే మరో రాత రాయడాన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించి గుర్తిస్తున్నారన్న విషయం వలపత్యంలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని సంస్థలు గుర్తించుకుంటే మంచిది. లేకుంటే ఇప్పటికే పరువు కోల్పోయారు, పాఠకులను కోల్పోతున్నారు.. భవిష్యత్తులో ఇంకే కోల్పోవాల్సి ఉంటుందో.. వారి విజ్ఞతే గుర్తించాలి. ఒక వేళ విజ్ఞత తప్పితే ప్రజలే తగిన ‘మందు’ వేయక మానరు.