Idream media
Idream media
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన మీడియాపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. ఇప్పుడు వారు వండి వడ్డిస్తున్న వార్తలు, కథలు, కధనాలు ఏకపక్షంగానే ఉన్నాయి. అమరావతి, తెలుగు మీడియం – ఈ రెండు సమస్యలు మినహా వారికి ఇంకేమీ పట్టినట్టు లేవు. అమరావతిలో రైతులు నష్టపోయారు, పోరాటం చేస్తున్నారు. ఇది మొదటి పేజిలో పతాక శీర్షిక. లోపలి పేజీల్లో కొనసాగింపు. ఇక తెలుగు భాష అంతరించి పోతుంది. అమ్మ భాషను కాపాడుకోవాలి. ఇది రెండో వార్త. ఈ వార్తకు కూడా అత్యంత ప్రాధాన్యత. పేజీలకు పేజీలు వీటికోసమే కేటాయింపు.
అమరావతి
సరిగ్గా ఐదేళ్ళ క్రితం 2015లో ఇదే రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణతో ఉపాధి కోల్పోయిన లక్షలాది రైతు కూలీలు, వేలాది కౌలు రైతులు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వందలాది రైతులు చేసిన ఆక్రందనలు అప్పట్లో ఈ మీడియాకు కనిపించలేదు, వినిపించలేదు. ఈరోజు రోడ్డెక్కుతున్న రైతులకు కూడా ఆనాడు రోడ్డునపడ్డ రైతు కూలీలు, కౌలు రైతులు కనిపించలేదు. బహుళ పంటలు పండే జరీబు భూములు మినహా ఎకరం ఐదులక్షల రూపాయలకు కూడా కొనేవారు లేని రోజుల్లో రాజధాని కారణంగా ఐదు కోట్ల రూపాయలు వస్తే సొమ్ము జేబుల్లో వేసుకున్న రైతులు పదుల సంవత్సరాలుగా తమ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతులు, రైతు కూలీలు రోడ్డునపడి రోదిస్తుంటే పట్టించుకోని ఈ మీడియా, ఈ రైతులు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం కావడం, పనిగట్టుకొని ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయడం వెనుక ఉన్న “సామాజిక వర్గ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు” మాత్రమే కనిపిస్తున్నాయి. సాటి కౌలు రైతుల కోసం, రైతు కూలీల కోసం ఐదేళ్ళ క్రితం ఒక్క అడుగు కూడా వేయని ఈ రైతుల ఆందోళన పట్ల ఇతరులు ఎవరికీ పట్టక పోవడంలో ఆశ్చర్యం లేదు. అయినా “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ” అని ఈ రైతుల బాధను రాష్ట్ర బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ మీడియాను విశ్వసించే స్థాయి పోయిందని 2019 ఎన్నికలు ఋజువు చేశాయి. కాకపోతే కాలక్షేపం కబుర్లకు మాత్రమే మీడియా చెప్పే విషయాలు ఉపయోగపడుతున్నాయి.
మాతృభాష
ఇక తెలుగును బ్రతికించుకుందాం అనే నినాదంతో ఈ మీడియా చేస్తున్న విన్యాసం సర్కస్ లో కూడా కనిపించవు. విద్యను వ్యాపారంగా చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్న వ్యక్తుల విద్యా వ్యాపారాన్ని కాపాడుకోవడానికి “మాతృభాష పరిరక్షణ” పేరుతో వీరు వండి వార్చే కథలు, కథనాలూ మళ్ళీ “కృష్ణ శాస్త్రి బాధ” ను గుర్తు చేస్తున్నాయి. పట్టుమని పదిమంది విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో మాతృ భాష అంతరించిపోతుందని గుండెలు బాదుకుంటున్న ఈ విద్యా వ్యాపారాలు, వారితరఫున బాకా ఊదుతున్న మీడియాను చూస్తుంటే శవయాత్రలో డప్పు కొట్టేవాళ్ళు, గెంతులేసే వాళ్ళే కనిపిస్తున్నారు. విద్యావ్యాపారం పడిపోతుందన్న బెంగ ఈ మీడియా చెప్పే ప్రతి అక్షరంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
రాజధాని మార్చడం, మార్చకపోవడం రాజకీయపరమైన అంశం. దాన్ని రాజకీయంగానే ప్రశ్నిస్తా. చర్చిస్తా. కానీ ఐదేళ్ళ నాడు ఉపాధి కోల్పోయిన రైతుకూలీలు, కౌలు రైతుల పట్ల కనీస సానుభూతి చూపించని ఈ రైతుల ఆందోళన పట్ల నాకెలాంటి సానుభూతీ లేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, ఇంగ్లీషును పేదల కుటుంబాలలోకి రానివ్వకుండా చేసి, విద్యను వ్యాపారం చేసిన ప్రవేటు విద్యావ్యాపార వేత్తల పక్షాన నిలబడి మాతృభాష పరిరక్షణ పేరుతో చేసే ఈ అక్షర వ్యభిచారం పట్ల కూడా నాకు ఎలాంటి సానుభూతీ లేదు. రాజకీయ లక్ష్యంతో విస్తృత రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు వదిలేసి వ్యాపార ప్రయోజనాలు రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తే అది చలం చెప్పినట్టు “కృష్ణశాస్త్రి బాదే కాని శ్రీశ్రీ బాధ” అవదు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేట్ విద్యావ్యాపారం రాష్ట్ర ప్రజల బాధ కాదు.