iDreamPost
android-app
ios-app

Telangana Legislative Council – తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ పోటీలో ప్ర‌ముఖులు

Telangana Legislative Council – తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ పోటీలో ప్ర‌ముఖులు

కొంత కాలంగా ఖాళీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్‌ ఎంపికపై కసరత్తు మొదలైంది. త్వరలోనే ప్రొటెం ఛైర్మన్‌ స్థానం ఖాళీ అవుతుండటంతో నెక్స్ట్ ఎవరన్నదానిపై అధికార పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నదీ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణ శాసనమండలి ఇప్పుడు ఫుల్‌ కోరంతో ఉంది. ఇటీవలే 19 MLC స్థానాలు భర్తీ అయ్యాయి. అయితే మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు మాత్రం ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రొటెం ఛైర్మన్‌తో సభ నడుస్తోంది. కానీ వచ్చే ఏడాది జనవరి 4తో ఆయన పదవి కాలం కూడా ముగియనుంది. దీంతో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను నియమించడం పక్కాగా కనిపిస్తోంది. ఆ పదవుల కోసం సీనియర్లంతా ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారు. మాజీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి MLCగా ఎన్నిక అయ్యారు. గతంలో ఛైర్మన్‌గా ఉండటంతో మళ్లీ ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. కానీ గుత్తా మాత్రం కేబినెట్‌ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొత్త ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎల్‌. రమణ, బండ ప్రకాష్‌ కూడా రేసులో ఉన్నారు.

మరోవైపు, డిప్యూటీ ఛైర్మన్ కోసం సీనియర్ ఎమ్మెల్సీలు MS ప్రభాకర్, పట్నం మహేందర్ రెడ్డి, కాచుకుంట్ల దామోదర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, శాసనమండలి చీఫ్‌ విప్‌తో పాటు కొన్ని విప్ పదవులు కూడా ఖాళీ అయ్యాయి. వీటికోసం కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఇందుకోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, నవీన్ కుమార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే ఇంతకు ఛైర్మన్ పదవిని భర్తీ చేస్తారా లేక ప్రొటెం ఛైర్మన్‌తోనే నెట్టుకొస్తారా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also Read : ఛాన్స్ ఇస్తే ఇదెక్కడి పైత్యం.. ఇలా అయితే మొదటికే మోసం!