iDreamPost
android-app
ios-app

చిన్న పాపతో మణిరత్నం సాహసం – Nostalgia

  • Published Aug 07, 2021 | 11:12 AM Updated Updated Aug 07, 2021 | 11:12 AM
చిన్న పాపతో మణిరత్నం సాహసం – Nostalgia

మణిరత్నంకి క్లాసిక్ మేకర్ అనే పేరు ఊరికే రాలేదు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో స్టార్లతో సైతం భావోద్వేగాలను ప్రేరేపించే చిత్రాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి. మణిని స్ఫూర్తిగా తీసుకున్న దర్శకులెందరో. తను భీభత్సమైన ఫామ్ లో ఉండి నాలుగు బాషల అగ్రహీరోలు తనతో చేయాలని ఉవ్విళ్ళూరుతున్న సమయంలో ఏ దర్శకుడైనా ఒక చిన్న పాపను టైటిల్ రోల్ లో పెట్టి సినిమా చేయాలని అనుకుంటాడా. రిస్క్ అని భయపడడా. అలా చేస్తే ఇతర డైరెక్టర్లకు మణిరత్నంకు తేడా ఏముంటుంది. అందుకే అంజలి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

1989 దాకా మణిరత్నం చేసిన సినిమాల్లో ఘర్షణ, నాయకుడు, మౌన రాగం చాలా పేరు తీసుకొచ్చాయి. నిర్మాతలకు కాసులూ పండించాయి. తెలుగులో చేసిన ఒకే స్ట్రెయిట్ మూవీ గీతాంజలి బాషా భేదం లేకుండా మెప్పులు డబ్బులు రెండూ పొందింది. నిజానికి జబ్బు పడ్డ ఒక చిన్నపాప కథను మణిరత్నం ఎప్పుడో రాసుకున్నారు. కానీ మార్కెట్ దృష్ట్యా ఏ నిర్మాత మొదట సాహసించలేదు. కానీ ఒక ఇమేజ్ వచ్చాక తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పడ్డారు మణి. తీవ్రమైన జబ్బు బారిన పడి మానసికంగా ఎదగని ఒక మూడేళ్ళ పాప తన స్వంత తల్లితండ్రుల వద్దకు వచ్చాక జరిగే కథనే సెల్యులాయిడ్ మీద చూపించారు.

బిజినెస్ పరంగా బాగుంటుందని ముందు తండ్రి పాత్రకు మోహన్ ను అడిగారు మణిరత్నం. అయితే ఫ్యాన్స్ ఒప్పుకోరేమోనన్న సందేహంతో ఆయన వెనుకడుగు వేస్తే అది కాస్తా విలన్ వేషాలు వేసే రఘువరన్ కు దక్కింది. భార్య పాత్రకు రేవతి ఆలోచించలేదు. టైటిల్ రోల్ చేసిన షామిలితో ఎక్స్ ప్రెషన్లు రాబట్టుకోవడానికి యూనిట్ విపరీతంగా శ్రమించాల్సి వచ్చేది. చాలా రీషూట్లు జరిగి ఫిలిం వృథా అయ్యేది. అయినా మణిరత్నం పట్టు వదల్లేదు. స్పెషల్ క్యామియో చేసిన ప్రభు క్యారెక్టర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇళయరాజా పాటలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ విపరీతంగా ఎక్కేశాయి. 1990 జులై 12న తమిళంలో జులై 27న తెలుగులో విడుదలైన అంజలి అద్భుత విజయం దక్కించుకుంది. ఎన్నో అవార్డులు అందుకుని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలింది

Also Read : బ్రహ్మపుత్రుడితో మాస్ ఇమేజ్ – Nostalgia