Idream media
Idream media
మణిపూర్ లో రాజకీయ సంక్షోభం బిజెపికి పెద్ద తలనొప్పిగా తయారు అయింది. రాష్ట్రంలో బిజెపి సర్కార్ పడిపోయే ప్రమాదంలో ఉండటంతో బిజెపికి చెమటలు పడుతున్నాయి. ఈ సందర్భంలో మణిపూర్ లోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు దేశ రాజధాని ఢిల్లీకి చేరడంతో ఆ పచాయితీ ఢిల్లీకి చేరినట్లు అయింది.
మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వానికి వారం రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకొన్న నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు హుటాహుటిన రాత్రికి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బిజెపి జాతీయ నాయకత్వంతో చర్చలు జరపడం కోసమే వారు ఢిల్లీ వచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరిగాయి.
మణిపూర్ బిజెపి ప్రభుత్వానికి రాజీనామా చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ దశలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకునేందుకు మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు సికె సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మతో కలసి ఇంపాల్‌కు వెళ్లారు. బిశ్వాస్ శర్మ బిజెపి నాయకత్వంలోని నార్త్ ఈస్టర్న్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఈడిఎ)కి కన్వీనర్. ఆయనకు సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దే దిట్టగా కూడా పేరుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా మొన్నటి వరకు ఈ కూటమిలోనే కొనసాగింది.
సంగ్మా, శర్మాలు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించక పోవడంతో ఆ నలుగురు శాసన సభ్యులను తీసుకొని సంగ్మా, బిశ్వాన్‌లు ప్రత్యేక అద్దె విమానంలో ఢిల్లీకి బయల్దేరి వచ్చారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన యమ్‌నమ్ జాయ్‌కుమార్ సింగ్, ఎల్. జయంత కుమార్, లెట్‌పో హవోకిప్, ఎన్ కెయిసీలు బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే.
ఆ నలుగురితో తాము ఇప్పటి వరకు జరిపిన చర్చలు ఫలప్రద దిశగానే కొనసాగాయని, తదుపరి చర్చల కోసం ఢిల్లీకి వచ్చామని, ఇక్కడ బిజెపి సీనియర్ నాయకులతో జరిపే చర్చలతో మణిపూర్ సంక్షోభం ముగుస్తుందని భావిస్తున్నానని బిశ్వాస్ శర్మ మీడియాకు తెలిపారు.
బిజెపి నేత అమిత్ షా మంత్రాంగం ఫలించింది. ఆయనతో చర్చల అనంతరం మణిపూర్ లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, ఆ వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా, జెపి నడ్డా, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి.
ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆపై మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు.
“కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సిఎం వై జాయ్ కుమార్ తో కలిసి న్యూఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపి తమ మద్దతును కొనసాగిస్తుంది” అని హిమాంత తెలియజేశారు.
తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నామని ప్రకటించడంతో బీరెన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. బిజెపికి చెందిన ముగ్గురితో పాటు, ఎన్పీపికి చెందిన నలుగురు, బయట నుంచి మద్దతిస్తున్న ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ఈ వారం ప్రారంభంలో ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడగా, బిజెపి అధినాయకత్వం స్పందించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసి విజయవంతమైందని అనిపిస్తోంది.