iDreamPost
iDreamPost
తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న నందమూరి తారకరామారావు వారసుడిగా ‘తాతమ్మ కల’తో తెరంగేట్రం చేసిన బాలకృష్ణకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. 1983లో భారతీరాజా దర్శకత్వంలో పాండ్యన్-రేవతి-మనోరమ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మన్ వాసనై’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. థియేటర్ల వద్ద జనమే జనం. ఫ్యామిలీలు సైతం బ్లాక్ లో టికెట్లు కొని చూస్తున్నారు. భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డికి ఇది విపరీతంగా నచ్చేసి రీమేక్ హక్కులు కొన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా దీన్ని తీయాలని ఆయన ఆలోచన. నిజానికి ఒరిజినల్ వెర్షన్ మన అభిరుచులకు అనుగుణంగా ఉండదు.
ఇదే అనుమానాన్ని కోడి రామకృష్ణ వ్యక్తం చేసినప్పుడు రచయిత గణేష్ పాత్రో ఆ మార్పులు చేసే బాధ్యతను తీసుకున్నారు. ముందు కథ విని అంతగా ఆసక్తి చూపించని ఎన్టీఆర్ గారు కొడుకు బాలకృష్ణ ఉత్సాహంతో పాటు టీమ్ పట్టుదల చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా 1984 మే నెలలో అప్పటి మదరాసు ఇప్పటి చెన్నైలో షూటింగ్ మొదలయ్యింది. ఇళయరాజా ప్రభంజనంలో కెవి మహదేవన్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవడం మొదట్లో అందరినీ ఆశ్చర్యపరిచినా అది ఎంత గొప్ప నిర్ణయమో తర్వాత అర్థమయ్యింది. పెట్టిన బడ్జెట్ కు రెట్టింపు బిజినెస్ జరుపుకుంది మంగమ్మ గారి మనవడు. సరికొత్త రికార్డులకు అక్కడే పునాది పడింది
ఓ బామ్మా మనవడు అతని మరదలు ఈ ట్రయాంగిల్ సెంటిమెంట్ స్టోరీకి ఎమోషనల్ టచ్ ఇచ్చిన తీరు అన్ని వర్గాలను మెప్పించింది. ఫలితంగా 1984 సెప్టెంబర్ 7న రిలీజైన మంగమ్మ గారి మనవడు 28 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం ఓ రికార్డు. అన్ని షిఫ్టింగులు కలిపి హైదరాబాద్ లో 565 రోజులు ఆడిందీ సినిమా. దంచవే మేనత్త కూతురా, వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త పాటలు మాస్ కు వెర్రెక్కించాయి. శ్రీసూర్యనారాయణ మేలుకో పాట వినిపించని ఇల్లు లేదు. భానుమతి గారి సెకండ్ ఇన్నింగ్స్ కి, వీరయ్యగా బాలకృష్ణ పెర్ఫార్మన్స్ కి బాక్సాఫీస్ సెల్యూట్ కొట్టింది. ఇక అది మొదలు సోలో హీరోగా వచ్చిన స్టార్ స్టేటస్ బాలయ్యకు దశాబ్దాలుగా నిలబడిపోయింది
Also Read : చిన్న పాపతో మణిరత్నం సాహసం – Nostalgia