అది కేవలం 35 చదరపు కిలోమీటర్ల భూభాగం…! ఇప్పుడదే భారత్, నేపాల్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. సందట్లో సడేమియా అన్నట్లు చైనా ఈ విషయంలో కాలుదూర్చాలని చూస్తోంది. దీంతో మంచుకొండల్లో ఒక్కసారిగా అగ్గిరాజేసుకుంది. అసలు వివాదానికి కారణమైన ప్రాంతం ఎక్కడుంది? హఠాత్తుగా వార్తల్లోకి ఎందుకెక్కింది? వివాద నేపథ్యం ఏమిటి? తదితరాల గురించి చూద్దాం……
కొత్త మ్యాపులతో….
కాలపానీపై భారత్, నేపాల్‌ల మధ్య ఎప్పటి నుంచో బేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే గత నవంబర్ 2న కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను సూచిస్తూ భారత ప్రభుత్వం మ్యాపులు విడుదల చేయడంతో వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. మ్యాపులకు వ్యతిరేకంగా నేపాల్‌లో నిరసనలు చెలరేగాయి. దేశ భూభాగాలను రక్షించుకోవాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం 15 రోజుల్లోగా సుగౌలీ ఒప్పందం(1816)పై సంతకం చేసిన మ్యాపులను భారత్‌తో పంచుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత సైనికులు వెంటనే కాలపానీ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని నేపాల్ ప్రధాని కేపీ ఓలి సూచించారు. దీని జనవరి 2న స్పందించిన భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ కొత్త మ్యాపులు కేవలం భారత ప్రాదేశిక భూభాగాన్నే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు.
అసలెక్కడుందా ప్రాంతం..?
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా, నేపాల్‌లోని దార్చులా జిల్లాకు మధ్య 3,600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతమే కాలపానీ. మహాకాళీ నది ఈ ప్రాంతం నుంచే ప్రవహిస్తోంది. 1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. కాలపానీ వద్ద మహాకాళీ నదిలో అనేక ఉపనదులు కలుస్తాయి. పైగా ఇదే ప్రాంతంలో నేపాల్, భారత్, చైనా సరిహద్దులను పంచుకుంటున్నాయి. దీంతో దేశ భద్రత పరంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది.
సుగౌలీ ఒప్పందం..
సుగౌలీ ఒప్పందాన్ని ఉదహరిస్తూ కాలపానీ తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్–ఈస్టిండియా కంపెనీ మధ్య 1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నది భారత్‌తో నేపాల్‌కి సరిహద్దుగా ఉందని వాదిస్తోంది. కాలపానీ తమ దేశంలోని దార్చులా జిల్లాలో ఉందని, లిపుగడ్‌కు తూర్పు ప్రాంతమంతా తమ కిందకే వస్తుందంటోంది. అయితే కాలపానీలోనే మహాకాళీ నది జన్మిస్తోంది కాబట్టి పశ్చిమ భూభాగం మొత్తం తమదేనని భారత్ వాదిస్తోంది. ఇందులో భాగంగా 1830 నాటి పితోర్‌గఢ్ రికార్డులను భారత్ బయటపెట్టింది. 1879లో బ్రిటీషు అధికారులు ముద్రించిన మ్యాపుల ప్రకారం కాలపానీ మొత్తం భారత్‌లోనే ఉండటం గమనార్హం.
మానస సరోవర్‌కు మార్గంగా…..
భారత్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు కాలపానీ మీదుగానే వెళ్తారు. 1962లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పటి నుంచీ ఈ ప్రాంతం ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. అయితే చైనాతో యుద్ధం సమయంలో భారత్ ఈ ప్రాంతంలో సైనిక పోస్టులు ఏర్పాటు చేసుకుందని…యుద్ధానంతరం నేపాల్‌కు ఉత్తర ప్రాంతంలోని సైనిక పోస్టులను తొలగించిన భారత్ కాలపానీలో మాత్రం తొలగించలేదని నేపాల్ వాదిస్తోంది. అయితే భారత్ 1961లో కాలపానీలో జనాభా లెక్కలు చేపట్టినప్పుడు అభ్యంతరం చెప్పని ఆ దేశం ఇప్పుడొక్కసారిగా వివాదం చేయడం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చైనా అత్యుత్సాహం..
విషయం ఏదైనా తలదూర్చడం చైనాకు అలవాటే..! పైగా భారత్‌కు సంబంధించిన విషయమైతే ఆ దేశానికి ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది. గతంలో చైనా అనవసరంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆర్టికల్ 370 రద్దు విషయంలో వేలు పెట్టింది. ఇప్పుడూ అదే తరహాలో భారత్‌ను బూచిగా చూపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నేపాల్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న డ్రాగన్ దేశం రక్షణ రంగంలోనూ ఆ దేశాన్ని పూర్తి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
పరిష్కారం దొరుకుతుందా….
ఈ వివాదంపై వాజ్‌పేయి కాలంలోనే చర్చలు జరిగాయి. 2000లో రెండు దేశాల ప్రధానులు కాలపానీపై చర్చించారు. అనంతరం విదేశాంగ కార్యదర్శులు సమస్య పరిష్కారానికి కృషిచేశారు. 2014లో మోదీ నేపాల్‌లో పర్యటించినప్పుడు ఈ విషయం ప్రాస్తవనకొచ్చింది. అయినప్పటికీ వివాదం ఓ కొలిక్కిరాలేదు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో త్వరలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు కాలపానీపై చర్చించే అవకాశం ఉంది.