iDreamPost
android-app
ios-app

మణప్పురం సంస్థలో ఉద్యోగిని చేతివాటం.. 10 కేజీల బంగారంతో జంప్

మణప్పురం సంస్థలో ఉద్యోగిని చేతివాటం.. 10 కేజీల బంగారంతో జంప్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టడు అనేది సామెత. కొన్ని సంఘటనలు చూస్తే నిజమని అనిపించక మానదు. నమ్మకంగా ఉన్నట్లు నటించి.. అవకాశం చూసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు కేటుగాళ్లు. యజమానుల కళ్లు గప్పి దోచుకెళుతున్నారు. తాజాగా అటువంటి భారీ మోసమే బయట పడింది. తిన్నింటి వాసలు లెక్కగడుతూ.. పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేసింది వెంకట పావని అనే ఉద్యోగిని. కోట్ల విలువ చేసే బంగారంతో ఉడాయించింది. కొన్ని రోజుల నుండి విధులకు హాజరు కాకపోవడంతో ఆమె నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కంకిపాడులోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో చోటుచేసుకుంది. ఆ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారం నగలను జాగ్రత్త చేసే విభాగంలో పనిచేస్తోంది పావని.

ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఆ విభాగంలో పని చేస్తున్న పావనికి.. ఆ బంగారు నగలపై కన్ను పడింది. వాటిని కొట్టేయాలన్న ప్లాన్ వేసింది. 10.660 కేజీల బంగారాన్ని మరొకరి సాయంతో దోచుకెళ్లింది. సోమవారం విధులు ముగించుకుని వెళ్లిన పావని, మంగళవారం విధులకు హాజరు కాలేదు. ఫోన్లు చేస్తున్న స్పందించలేదు. అయితే ఈ లోపు ఆభరణాలు విడిపించుకునేందుకు ఖాతాదారులు రావడం.. ఆ ఆభరణాలు కనిపించకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తం తనిఖీలు చేయగా.. 10 కిలోల బంగారం కనిపించకుండా పోవడంతో ఆ సంస్థ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచీ సీసీ కెమెరాలు పరిశీలించగా.. రెండు నెలల నుండి పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు.

అయితే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తే.. పావని, మరో వ్యక్తి కలిసి బ్యాగుతో కారులో ఉడాయించడం కనిపించింది. ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ బ్రాంచ్‌లో సుమారు వెయ్యి మంది ఖాతాదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన కస్టమర్లు.. ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. కాగా, సంస్థ దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, మీ నగలు మీకు అప్పగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పావని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆమె కారు దావులూరు టోల్ గేట్ నుండి క్రాస్ చేసినట్లు గ్రహించారు.