కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కాలంలో వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్ తగిలిన విషయం తెలిసిందే. రెండు నెలల రీడింగ్ ఒకేసారి తీయడంతో ఏ,బి,సి స్లాబ్ మారి చార్జీలు భారీగా పెరిగాయి. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక సాధారణ సామాన్య వ్యక్తికి వచ్చిన కరెంట్ బిల్లు పలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే విద్యుత్ అధికారుల తప్పిదం వల్ల కొందరికి వేలలో, లక్షల్లో విద్యుత్ బిల్లులు రావడం చూసాం. కానీ మధ్యప్రదేశ్ లో విద్యుత్ అధికారుల నిర్వాకానికి ఒక సామాన్యుడికి విద్యుత్ బిల్లు షాక్ మాములుగా తగల్లేదు. అతనికి వచ్చిన బిల్లు వేలను,లక్షలను దాటేసి 80 లక్షల కోట్లకు చేరుకుంది. దాంతో ఆ బిల్లుని చూసి తెరుకోవడానికి సదరు వ్యక్తికి చాలా సమయం పట్టింది..
వివరాల్లోకి వెళితే సింగ్రౌలి జిల్లాలో బైఢన్ గ్రామంలో ఓ సాధారణ వినియోగదారుడికి ఏకంగా 80 లక్షల కోట్ల బిల్లును ఇచ్చింది మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ. దీంతో షాక్ కి గురైన సదరు వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయాడు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరైన బిల్లును ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదని బాధితుడు తెలపడంతో నెటిజన్లు సంబంధిత అధికారుల తీరును దుయ్యబడుతున్నారు. సామాన్యుడికి 80 లక్షల కోట్ల విద్యుత్తు బిల్లును ఇవ్వడమేంటని పలు దేశాల బడ్జెట్ కూడా ఇంత మొత్తంలో ఉండదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వార్తపై ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి..