iDreamPost
android-app
ios-app

రెండు లక్షలు అప్పు.. వివాహేతర సంబంధం

  • Published Jun 18, 2022 | 10:33 AM Updated Updated Jun 18, 2022 | 11:32 AM
రెండు లక్షలు అప్పు.. వివాహేతర సంబంధం

శంషాబాద్ సమీపంలోని ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ఉత్తరప్రదేశ్ – బనారస్ కు చెందిన ప్రమోద్ కుమార్ (40) నగరానికి వలస వచ్చాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్ బేగంను వివాహం చేసుకుని, తన పేరును ఇక్బాల్ గా మార్చుకున్నాడు. భార్యతో కలిసి గోల్కొండ రిసాలా బజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇక్బాల్ భూత వైద్యుడిగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన లతీఫ్ (మన్ను) వద్ద గతంలో రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో లతీఫ్ తరచూ ఇక్బాల్ ఇంటికెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో మెహరాజ్ బేగంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన ఇక్బాల్.. లతీఫ్ – మెహరాజ్ బేగంను హెచ్చరించాడు.

మరోసారి తన ఇంటికి రావొద్దని లతీఫ్ కు చెప్పాడు. తమకు ఇక్బాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన మోహరాజ్ – లతీఫ్ లు.. ఎలాగైనా అతడిని చంపాలనుకున్నారు. హత్య చేయించేందుకు.. మలక్‌పేట్‌ ముసారాంబాగ్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్, గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్‌ సోఫియాన్‌లతో మాట్లాడాడు లతీఫ్. రూ.10 వేలు పైకం కూడా ఇచ్చాడు. జూన్ 11న ఇక్బాల్ సిద్ధిపేటకు వెళ్తున్నట్లు తెలుసుకున్న లతీఫ్.. మహ్మద్‌ ఉస్మాన్, షేక్‌ సోఫియన్‌తో కారులో వేచి ఉన్నాడు. ఇక్బాల్‌ యాక్టివాపై టోలిచౌకీ వైపు వెళుతుండగా లక్ష్మిగూడ రోడ్డు వద్దకు రాగానే లతీఫ్‌ కారును బైక్‌కు అడ్డుపెట్టి ఇక్బాల్‌ను కిడ్నాప్‌ చేశాడు. లతీఫ్, మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్బాల్‌ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఈసీ నదిలో పడేశారు.

ఈ క్రమంలో ఇక్బాల్ కు చెందిన ప్రెస్ ఐడీ కార్డు పడిపోయింది. నదిలో నీరు కొద్దిగానే ఉండటంతో.. మూడ్రోజులకే మృతదేహం పైకి తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ ఐడీకార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో 11న తెల్లవారుజామున టాటా ఇండికా కారు, యాక్టివా తెల్లవారుజామున రావడం, 25 నిమిషాల్లో తిరిగి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వాటి నంబర్లు లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు ప్రారంభించారు. ఇక్బాల్ మృతిపై మెహరాజ్ బేగంకు సమాచారం అందించగా.. మూడు రోజుల క్రితం బయటికి వెళ్లి రాలేదని చెప్పింది. మెహరాజ్ బేగం ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. ఆమెను మరింత లోతుగా ప్రశ్నించడంతో ఇక్బాల్ ను హత్యచేయించినట్లు ఒప్పుకుంది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.