Idream media
Idream media
బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మమతా బెనర్జీ ప్రమాదం అనంతరం అది మరింత రసవత్తరంగా మారింది. మమతకు తగిలిన గాయం చుట్టూనే నేతల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీకి ఇటీవల జరిగిన ప్రమాదం ఓ కుట్ర అని ఆమె ఆరోపించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ‘‘ఈ రోజు నా హెలికాప్టర్‌లో సమస్య తలెత్తింది. కానీ దాన్ని నేను కుట్రగా పేర్కొనలేదు’’ అని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో అన్నారు. ‘‘కానీ, ఇటీవల మమత కాలికి గాయమైంది. ఆమె ఎలా గాయపడ్డారో తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం దీన్ని కుట్ర అంటోంది. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది’’ అని అమిత్ వ్యాఖ్యానించారు.
మమత బెనర్జీకి అయిన గాయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. సోమవారం ఆయన ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడారు. ఆ ఘటన స్వల్ప ప్రమాదమేనని, కానీ, ఆమె ఎన్నికల్లో గెలిచేందుకు ఎమోషనల్ కార్డును ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ అంశాన్ని మమత రాజకీయం చేయొద్దని కోరారు.
‘‘నేను ఎలాంటి దాడులకు భయపడేదాన్ని కాదు. ఈ నెల 10న నాకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి కోలుకున్నాను. నాకు ప్రమాదం జరగ్గానే.. కొందరు నేను ఇక ప్రచారం చేయలేననుకున్నారు. కుట్రలు నా ముందు పనిచేయవు. సామాన్య ప్రజలు అనుభవిస్తున్న నొప్పి ముందు నేను నా నొప్పిని లెక్క చేయను. నేను విరిగిన కాలితోనే పోరాటం కొనసాగిస్తున్నాను. మీరు (ప్రజలు) పోరాడలేరా? ఇళ్ల నుంచి బయటకు రండి. నాకు మద్దతివ్వండి’’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం వీల్‌చైర్ పైనుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మమతా బెనర్జీకి జరిగిన ప్రమాదం అనంతరం ప్రధాన భద్రతాధికారి మార్పు, నియామకం కూడా వివాదంగా మారింది. మమత ప్రధాన భద్రతాధికారిగా అదనపు డీజీ జ్ఞాన్వంత్ సింగ్ నియమితులయ్యారు.
మమతకు ప్రమాదం జరిగాక.. డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ వివేక్ సాహోని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.కాగా.. వీరిద్దరూ తృణమూల్ అనుకూలురేనని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీజేపీ ఇంతకు ముందే ఈసీకి ఫిర్యాదు చేసింది. అయినా.. ప్రభుత్వం మమత ప్రధాన భద్రతాధికారిగా జ్ఞాన్వంత్‌ను నియమించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఇలా బెంగాల్‌లో ప్రతీ అంశంపైనా టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలూ ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిగా మారింది.