iDreamPost
android-app
ios-app

మోదీని క‌లిసే ముందు మమత షాకింగ్ డెసిష‌న్‌

మోదీని క‌లిసే ముందు మమత షాకింగ్ డెసిష‌న్‌

మ‌మ‌తా బెన‌ర్జీ.. దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మించి ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్న పేరు అది. ప‌శ్చిమ బెంగాల్ సంగ్రామాన్ని దేశ రాజ‌కీయ సంగ్రామంగా త‌న ప‌దునైన మాట‌ల‌తో మార్చేశారు. ఆ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బెంగాల్ లో బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై మండిప‌డ్డారు. దీంతో ఆమె చూపు రాష్ట్రంపైనే కాకుండా యావ‌త్ దేశంపై ప‌డింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడో సారి బెంగాల్ పీఠాన్ని అధిరోహించిన అనంత‌రం కూడా ఆమె చ‌ర్య‌లు అలాగే ఉంటున్నాయి. తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో సమావేశం కావడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీని కూడా కలవనున్నారు. అంత‌కు ముందే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ల‌మెంట్ ను కుదిపేస్తూ, దేశ వ్యాప్తంగా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తున్న పెగాస‌స్ స్పై వేర్ వివాదంపై విచార‌ణ‌కు ఆదేశించారు.

పెగాస‌స్.. దేశవ్యాప్తంగా ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ . పెగాసస్‌ స్పైవేర్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. దీనిపై వారం రోజులుగా పార్ల‌మెంట్ లో దుమారం రేగుతూనే ఉంది. ఓ ర‌కంగా అధికార పార్టీకి విప‌రీత‌మైన త‌ల‌నొప్పులు తెచ్చింది. ఈ స్పైవ్ వేర్ తో హ్యాకింగ్ గురైన వారి డేటాబేస్ ఒక‌టి ఇటీవ‌ల లీకైంది. ఇందులో యాభై దేశాల‌కు చెందిన యాభై వేల‌కు పైగా ఫోన్ నెంబ‌ర్లు ఉన్నాయి. ఒక్క భార‌త్ లోనే 300 మందికి పైగా బాధితులు ఉన్నార‌ని, వారిలో అత్యంత ప్ర‌ముఖులు ఉన్నార‌ని పేర్ల‌తో స‌హా వెలుగులోకి రావ‌డం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా కు కూడా ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విచార‌ణ జ‌రిపించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ విష‌యంలో మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్రం కంటే ఓ అడుగు ముందుకేసి అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్నారు.

దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై బెంగాల్ రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరే ముందు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేనందున తామే విచారణ కమిషన్‌ను నియమించినట్లు, విచారణ కమిషన్‌ చట్టం-1952లోని సెక్షన్‌-3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పున‌రుద్ఘాటించారు.

ఈ చట్టం ప్రకారం.. ఏ అంశంపైనైనా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమిస్తే.. అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం.. కేంద్ర కమిషన్‌ విచారణ జరిపినంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అలా కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా విచారణ కమిషన్‌ను నియమిస్తే, అదే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు. అయితే ఆ రాష్ట్రంతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో విచారణ జరిపాలని నిర్ణయిస్తే మాత్రం కేంద్రం మరో కమిషన్‌ను నియమించవచ్చు. దీనిని ఆధారంగా చేసుకొని మమతా బెనర్జీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ‌మ‌త బాట‌లో ఇతర బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న‌డుస్తాయా? ఆయా రాష్ట్రాల‌లో కూడా అలాంటి నిర్ణ‌యాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వమే విచారణ కమిషన్‌ను నియమిస్తుందా.. మ‌మ‌త తీసుకున్న డెసిష‌న్ తో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.