Idream media
Idream media
గత అసెంబ్లీ ఎన్నికల్లో పాతికేళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడి త్రిపురలో పీఠం ఎక్కింది భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు ఎన్నికల్లో యాభై స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కే ఒక్క స్థానంలో గెలుపొందిన బీజేపీ ఐదేళ్లలో అధికారం చేజిక్కించుకోవడానికి భారీ ప్రణాళికలే రచించింది. పాతికేళ్ల కమ్యూనిస్టు కోటను బద్దలు గొట్టేందుకు వేలాది మంది బీజేపీ, ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలను రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వచ్చింది. బీజేపీ మార్క్ పంథాలో ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి అట్టడుగు స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంలో విజయవంతమైంది. ఫలితంగా 2018 ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి త్రిపురలో కాషాయ జెండా ఎగురవేసింది. అటువంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఓ టీమ్ ను రంగంలోకి దింపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బ కొట్టిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పుడు 2023లో జరగబోయే త్రిపుర ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ రాష్ట్రంలో కూడా తమ సత్తా చాటాలని మమతా బెనర్జీ భారీ ప్రణాళికలే రచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం టీఎంసీ తరఫున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం పని చేస్తోంది. ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభావాన్ని అంచనా వేస్తోంది. అవసరమైన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అగర్తలతో పాటు త్రిపుర అంతా మమత ఎంత మేరకు ప్రభావం చేయగలరు, బీజేపీ పని తీరుపై స్థానికంగా ఎటువంటి అభిప్రాయం ఉంది, బీజేపీని కాదని ప్రజలు టీఎంసీ వైపు మొగ్గు చూపాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలి అనే అంశాలను తెలుసుకునేందుక ఓ సర్వే నిర్వహిస్తున్నారు.
Also Read:అద్దెకు ప్రధాని భవనం.. ఎక్కడో తెలుసా!
ఏప్రిల్ లో జరిగిన త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో అధికార బీజేపీ, దాని మిత్ర పక్షానికి పరాభవం ఎదురైంది. త్రిపుర అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో స్వదేశీ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా) విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 28 సీట్లలో కొత్త కూటమి 18 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కూటమి తొమ్మిది సీట్లు దక్కించుకోవడం ద్వారా ఆ పార్టీకి ఎదురీత మొదలైందన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఇదే అదునుగా టీఎంసీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తోంది. కమ్యూనిస్టు కోటగా ముద్రపడిన పశ్చిమ బెంగాల్ లో స్థానం పదిలం చేసుకున్నట్లుగా త్రిపురలో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అరవై స్థానాలు గల త్రిపురలో రాజకీయ పరిస్థితులు ఏ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయో అంచనా వేస్తోంది. ఆ టీమ్ సభ్యులతో పాటు టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా.. మూడు రోజుల క్రితం అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని రాజకీయంగా బాగానే పాపులర్ చేసుకున్నారు. త్రిపుర రాజధాని అగర్తల విమానాశ్రయం నుంచి త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్తున్న అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌ను పలుచోట్ల అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలే తన వాహనంపై కర్రలతో దాడికి పాల్పడ్డారంటూ అభిషేక్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎంపీ వాహనంపై.. బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ‘బీజేపీ పాలనలో.. త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. రాష్ట్రాన్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు’ అంటూ సీఎం బిప్లబ్ దేవ్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read:రాహుల్ వైఖరిలో మార్పు వచ్చినట్లేనా?ఢిల్లీ అత్యాచార కేసు-ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన రాహుల్
టీఎంసీ నేత పర్యటనను అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీ పట్ల బీజేపీ సీరియస్ గానే దృష్టి సారించిందన్న విషయం అర్థమవుతోంది. అంటే రానున్న ఎన్నికల్లో టీఎంసీ పోటీని తట్టుకోవడానికి బీజేపీ కూడా సిద్ధంగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ పర్యటనను టీఎంసీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అభిషేక్ బెనర్జీ రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కలుస్తున్నారు. విద్యార్థులను కలుసుకుంటున్నారు. త్రిపురలోని సమస్యలన్నింటిపైనా ఇకపై టీఎంసీ ఉద్యమిస్తుందని ప్రకటిస్తూ బీజేపీపై పోరుకు రెడీ అన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇంతటితో ఆగకుండా టీఎంసీ నేతలు కుణాల్ ఘోష్, సమీర్ చక్రవర్తి తదితరులు కూడా త్వరలో త్రిపురలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి త్రిపురలో బీజేపీ ని ఢీ కొట్టేందుకు టీఎంసీ భారీ ప్రణాళికలే రచించిందన్నవిషయం అర్థమవుతోంది. మరి మున్ముందు అక్కడ రాజకీయాలు కూడా పశ్చిమబెంగాల్ ను తలపిస్తాయా చూడాలి.