Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరినీ ఓ పట్టాన వదలడం లేదు. తన పాలనకు అడ్డంకులు సృష్టించినా, సృష్టిస్తున్నారని అనుమానాలు తలెత్తినా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ముందు నాటి నుంచీ కేంద్రంపైనా, ప్రధాని మోడీ పైనే కాకుండా, బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ పై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆ గవర్నర్ మాకొద్దంటూ ఎన్నికలకు ముందే దీదీ కేంద్రానికి లేఖలు రాశారు. తాజాగా గవర్నర్ పై మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ ను తాను బ్లాక్ చేసినట్లు ప్రకటించారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ ధన్ కర్ పై ఆమె ఆరోపణలకు దిగారు.
2019 లో బెంగాల్ గవర్నర్ గా పదవి చేపట్టినప్పటి నుంచే పాలక తృణమూల్ కాంగ్రెస్ కి, జగదీప్ ధన్ కర్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ దైనందిన కార్యక్రమాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని టీఎంసి నేతలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన హింసపై గవర్నర్ జగదీప్.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో… మమత ఆయనపై ఎదురుదాడికి దిగారు. ఆయన అవినీతిపరుడని, జైన్ హవాలా కేసులో ఆయనపై ఛార్జిషీట్ నమోదైందని మమత అన్నారు. ఆయనను తొలగించాలని కేంద్రానికి ఇప్పటికీ నాలుగుసార్లు లేఖలు రాశారు.
గతంలో కూడా గవర్నర్ కు సంబంధించి మమత మాట్లాడుతూ.. 1996 లో జైన్ హవాలా కేసులో ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలైందన్నారు. మాకు భారీ మెజారిటీ వచ్చినా మా ప్రభుత్వం మీద ఆయన పెత్తనమేమిటని ఆమె ప్రశ్నించారు. 1990 ప్రాంతంలో జైన్ డైరీస్ కేసుగా హవాలా కుంభకోణం నాడు పతాక శీర్షికలకెక్కింది. జైన్ బ్రదర్స్ పేరిట నలుగురు హవాలా బ్రోకర్ల ద్వారా రాజకీయ నాయకులకు భారీగా చెల్లింపులు జరిగాయని నాటి వార్తలు తెలిపాయి. ఈ స్కామ్ తో పలువురు బడా పొలిటికల్ లీడర్లకు లింక్ ఉండేదట. ఇది 18 మిలియన్ డాలర్ల స్కాండల్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా జగదీప్ ధన్ కర్ ని తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ ఏ నాటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండుపై మమతా బెనర్జీ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీతో బాటు ఇతర నేతలతో కూడా చర్చలు జరిపారు.
ఇప్పుడు తాజాగా మరోసారి గవర్నర్ తీరుపై నిప్పులు చెరిగారు దీదీ. ‘ధన్ కర్ గురించి ప్రధాని మోడీకి పలు లేఖలు రాశాను. ఆయన మా మాట వినడంలేదని, మాపై బెదిరింపులకు దిగుతున్నారని పీఎంకు నివేదించా. ఈ విషయం గురించి నేరుగా మోడీతో చర్చించా. గత ఏడాది కాలంగా దీన్ని ఓపికతో భరిస్తూ వచ్చాం. కానీ ధన్ కర్ పలు ప్రభుత్వ ఫైళ్లను క్లియర్ చేయలేదు. ఎన్నో ఫైళ్లను పెండింగ్ లో పెట్టారు. అలాంటి ఆయన ప్రభుత్వ విధానాల గురించి ఎలా మాట్లాడగలరు?’ అని దీదీ ప్రశ్నించారు. అయినా ఇప్పటివరకు ధన్కర్ ను గవర్నర్ గా ఎలా కొనసాగిస్తున్నారని, ఆయన్ను పదవి నుంచి ఎందుకు తొలగించట్లేదని క్వశ్చన్ చేశారు. గవర్నర్ ఇంటి నుంచే పెగాసస్ నడుస్తోందన్నారు. ధన్కర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు గవర్నర్ కొట్టి పారేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే చర్చలకు రావాలని ఆహ్వానించారు. ప్రజలకోసం అధికారంలో ఉన్న వాళ్లు కలసి పని చేయాలన్నారు.