బెంగాల్ టైగర్ కు నందిగ్రామ్ సలాం

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఉదయం నుంచి ఊరించి.. ఉడికిస్తూ వచ్చిన విజయం చివరికి మమత బెనర్జీనే వరించింది. శపథం చేసి మరీ ఆమె తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై ఆధిపత్యం ప్రదర్శించారు. 2016 ఎన్నికల్లో 81 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన సువేందును ఆ మెజారిటీ అంతా గల్లంతు చేసి 1200 ఓట్లతో అతన్ని మట్టి కురిపించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ విజయాన్ని పరిపూర్ణం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదరిస్తూ టూతర్డ్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.

క్షణక్షణం ఉత్కంఠ

సాక్షాత్తు సీఎం అభ్యర్థి తన మాజీ అనుచరుడిపై అతని కోటలోనే తలపడటంతో నందిగ్రామ్ నియోజకవర్గం దేశం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంది. హోరాహోరీగా జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిని వారిస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి నెలకొంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత మమత, సువెందుల మధ్య దోబూచులాడింది.

తొలి రౌండులో 1497 ఓట్లు వెనుకబడిన మమత నాలుగో రౌండ్ వరకు కొలుకోలేదు. దాంతో బీజేపీ అభ్యర్థి సువేందు 8106 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లిపోయారు. అయితే ఐదో రౌండులో పుంజుకున్న మమత సువేందు ఆధిక్యాన్ని 3110కి తగ్గించగలిగారు. ఆరో రౌండులో మళ్లీ సువేందు 7262 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడో రౌండులో మమత 1427, ఎనిమిదో రౌండులో సువేందు 8 వేల ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. తొమ్మిది, పది రౌండ్లలో మమత అధిక ఓట్లు సాధించి 2700 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. 16వ రౌండుకు వచ్చేసరికి మళ్లీ మమత ఆధిక్యత కోల్పోయి కేవలం ఆరు ఓట్లు వెనకబడటంతో టెన్షన్ మరింత పెరిగింది. దాంతో చివరిదైన 17వ రౌండ్ నిర్ణయాత్మకంగా మారింది. ఆ రౌండులో ఆధిక్యత కనబర్చిన మమత మొత్తం మీద సుమారు 1200 ఓట్లతో విజయం సాధించారు.

Also Read : ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ‘వ్యూహ సన్యాసం’

ప్రత్యర్థి కోటలో పాగా

నందిగ్రామ్ ఉద్యమంతో టీఎంసీ వెలుగులోకి వచ్చినట్లే.. ఆ నియోజకవర్గానికి చెందిన సువేందు అధికారి ఆ పార్టీ ద్వారా నాడు ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పేరుపొందారు. మమత ప్రోత్సాహంతో క్రమంగా రాష్ట్ర మంత్రిగా, పార్టీలో నంబర్ టూగా ఎదిగారు. అదే క్రమంలో నందిగ్రామ్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పట్టు పెంచుకొని తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు. అయితే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగి ఆ పార్టీలోకి ఫిరాయించారు. బీజేపీ అగ్రనేతల ప్రోద్బలంతో దమ్ముంటే నందిగ్రామ్ లో తనపై పోటీ చేసి గెలవాలని మమతను సవాల్ చేశారు.

అప్పటికే తనను వెన్నుపోటు పొడిచిన సువేందుపై ఆగ్రహంతో ఉన్న మమత సువేందుని మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని శపథం చేసి సొంత నియోజకవర్గం భావానీపూర్ ను వీడి నందిగ్రామ్ వెళ్లి బస్తీ మే సవాల్ అన్నారు. ఆ సమయంలోనే తన కాలికి దెబ్బ తగిలినా కట్టుతోనే ప్రచారం చేశారు. మోదీ, అమిత్ షా, నడ్డా తదితర బీజేపీ అగ్రనేతలందరూ నందిగ్రామ్ తరలివచ్చి ప్రచారం చేసినా సింగిల్ గానే పోరాడి విజయం సాధించారు. ఆమెకు లభించింది స్వల్ప మెజారిటీయే అయినా ప్రత్యర్థి సవాలును స్వీకరీంచి, తన శపథానికి కట్టుబడి ప్రత్యర్థి కోటలోకి వెళ్లి నెగ్గుకురావడమే గొప్ప విషయం. అందుకే నందిగ్రామ్ ఆమెకు సలాం చేసింది.

రెండొంతుల మెజారిటీ దిశగా టీఎంసీ

మరోవైపు రాష్ట్రంలో మూడోసారి అధికారం దిశగా మమత పార్టీ తృణమూల్ దూసుకుపోతోంది. రాష్ట్రంలో 294 సీట్లకు గాను 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఎంసీ 96 స్థానాల్లో విజయం సాధించి 120 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 24 చోట్ల విజయం సాధించి.. మరో 50 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి సంయుక్త మోర్చా కేవలం రెండు చోట్లే ఆధిక్యంలో ఉన్నాయి.

Also Read : ధైర్యే సాహసే దీదీ, అదే ఆమెకు శ్రీరామరక్ష

Show comments