Idream media
Idream media
దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త డిమాండ్ హల్‌చల్ చేస్తోంది. భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా రాజధానుల అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. పలు రాష్ట్రాల్లో అయితే ఆ విషయమై ఓ రకంగా యుద్ధాలే జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం వినూత్న పరిస్థితులు ఏర్పడ్డాయి. 400 రోజులుగా దానిపై రాద్దాంతం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దేశానికి మరిన్ని రాజధానుల అవసరం ఉందనే విషయాన్ని మమతా బెనర్జీ లేవనెత్తారు. దీంతో బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి తేవడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రెండు పర్యాయాలుగా ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏకఛత్రాదిపత్యంతో చక్రం తిప్పుతోంది. తిరుగులేని ఆధిపత్యం దిశగా దూసుకెళ్తోంది. బిహార్ సహా ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలోనూ బీజేపీ హవా కొనసాగింది. ఇక బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు ఉండదని అనుకుంటున్న తరుణంలో రైతు ఉద్యమం పేరుతో ఊహించని సెగ తాకింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మిత్రపక్షాల్లో సైతం నిరసన వ్యక్తం అవుతోంది. రైతులకు నచ్చ చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎదురులేకుండా దూసుకెళ్తున్న బీజేపీకి కళ్లెం వేయాలంటే ఏదో ఒకటి చేయాలనే తపన ప్రతిపక్షాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దేశానికి మరిన్ని రాజధానులన్న డిమాండ్ ను మమత తెరపైకి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
అతిపెద్దదైన భారత దేశానికి ఒక్క రాజధాని చాలదని, నాలుగు రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ తాజాగా ఉటంకించారు. శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కోల్‌కతాలో మమత భారీ ర్యాలీ నిర్వహించారు. నేతాజీ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు కోల్‌కతాకు ప్రధాని నరేంద్రమోదీ రాకముందే ఏడు కిలోమీటర్ల మేర ఆమె ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కారుపై దీదీ విమర్శనాస్త్రాలు సంధించారు. పనిలో పనిగా రాజధానుల ప్రస్తావన తెచ్చారు. పార్లమెంటు సమావేశాలను కేవలం ఢిల్లీలోనే కాకుండా రొటేషన్ పద్ధతిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్‌పై గట్టిగా పోరాడేందుకు బీజేపీయేతర పక్షాలు సిద్ధమవుతున్నాయా..? లేదా మమత వరకే పరిమితమా..? అనేది వేచి చూడాలి.