Idream media
Idream media
ఎవరీ మతువాలు.. బెంగాల్‌లో ఎందుకంత ప్రాముఖ్యత
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు మతువాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తృణముల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా మతువాలపైనా, రాజవంశీలపైనా ప్రత్యేక దృష్టిపెట్టాయి.
ఎవరీ మతువాలు?
పశ్చిమ బెంగాల్ భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమానా నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యం దిక్కులో అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే అక్కడ నుంచి ఉపాధి నిమిత్తం పశ్చిమబెంగాల్‌కు వలస వచ్చారు. వీరిని హిందూ శరణార్థులుగా చూస్తారు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్‌లో రెండో అతిపెద్ద షెడ్యూల్డ్ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కూచ్ బెహార్, దినజ్‌పూర్, మాల్డా వంటి సరిహద్దు జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నారు. ఈ సామాజిక వర్గమంతా దాదాపుగా ఒకేతాటిపై నిలవడంతో రాజకీయ నేతల దృష్టి వారిపై పడింది.
ప్రపంచంలో 5 కోట్ల మంది మతువాలు
ప్రపంచంలో 5 కోట్ల మంది మతువాలున్నారు. బెంగాల్‌లోని మొత్తం ఎస్సీ జనాభాలో మతువాలే 17.4 శాతంగా ఉన్నారు. బెంగాల్‌లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీటిలో కూచ్ బెహార్, జల్పాయిగురి, బిష్ణుపూర్, బొంగావ్ లోక్‌సభ స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌సీల్లో తమకున్న పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది.
బీనాపాణి దేవి ఆశీర్వాదంతో తొలిసారి పాగా..
2019 లోక్‌సభ ఎన్నికల్లో మతువా సమాజ పెద్ద, 100 ఏళ్ల బోరో మా బీనాపాణి దేవి ఆశీర్వాదం తీసుకొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బోరో మా మనవడు శాంతనును బొంగావ్ లోక్‌సభ స్థానంలో నిలబెట్టారు. దీంతో బీజేపీ తొలిసారిగా ఈ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
మతువాల పౌరసత్వచట్టం సవరణ?
ఇటీవల పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం(సీఏఏ)ను అమలు చేయడంపై హామీ ఇచ్చారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి శరణార్థుల సంక్షేమ పథకం, మాతువా వర్గంలోని వృద్ధులకు పింఛన్, యువతకు స్కాలర్‌షిప్ వంటి ఇతర పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు.
గుడాకాందీకి తొలిసారిగా ప్రధాని
మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాందీని మోదీ సందర్శిస్తారు. బెంగాల్‌లో మార్చి 27న తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు 26న బంగ్లాదేశ్‌కు మోదీ వెళ్లనున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా మోదీ నిలువనున్నారు. ప్రధానితో పాటు బెంగాల్‌లోని మాతువా వర్గానికి చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శాంతను ఠాకూర్ సైతం గుడాకాందీని సందర్శించే అవకాశాలు ఉన్నాయి.
రాజవంశీయులది సింహభాగమే..
750వ సంవత్సరం నుండి 1161 వరకు బెంగాల్‌ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపు రాజుల పాలన సాగింది. 13వ శతాబ్దం నుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం బెంగాల్‌లో రాజవంశీయుల సామాజికవర్గం కీలక ఓటుబ్యాంకుగా ఉంది. దీంతో వీరినీ ఆకట్టుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు.