Idream media
Idream media
వైసీపీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత నెలలో ఖమ్మం జిల్లాలో జరిగిన కమ్మ సామాజికవర్గ కార్తీక వనభోజనాల కార్యక్రమంలో మల్లాది వాసు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు దూషించారంటూ.. వారిని అంతం చేయాలనేలా మల్లాది వాసు మాట్లాడారు. అందుకోసం అందరూ చేతులు కలపాలని, ఇందుకోసం ఫండ్ ఏర్పాటు చేయాలని, తాను 50 లక్షల రూపాయలు ఇస్తానని మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న మల్లాది వాసు.. కార్తీక మాసంలో జరిగిన కమ్మ సామాజికవర్గ ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా దుమారం రేగింది. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు తరపున కాపు సంఘం నేతలు వాసుకి హెచ్చరికలు జారీ చేశారు. మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కౌన్సిలర్ అయిన మల్లాది వాసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయా కేసుల్లో తనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. మల్లాది వాసుని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వాసుపై పెట్టిన అన్ని కేసుల్లోనూ 41ఏ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వాసుకి అరెస్ట్ భయం తప్పింది.
Also Read : స్కిల్ స్కాం.. గంటాకు బెయిల్