ప్రముఖ పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యమయ్యారు. ఆయన వయసు ప్రస్తుతం 96 సంవత్సరాలు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో చంద్రశేఖర శాస్త్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రికి రామాయణ, భారత, భాగవతాల మీద ఉన్న పట్టు కారణంగా పురాణ ప్రవచనకారులలో ఆయన ప్రత్యేకత వేరే. తన పదిహేనవ ఏట నుంచి ఈ ప్రవచనాలు ప్రారంభించిన ఆయన చివరి రోజుల వరకు శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనాలు చేస్తూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో మల్లాది దక్షిణామూర్తి దంపతులకు 1925 ఆగష్టు 28వ తేదీన జన్మించిన చంద్రశేఖర శాస్త్రి తమ తాతగారైన మల్లాది రామకృష్ణ విద్వత్ చయనుల వద్ద సంస్కృతం, తెలుగు భాషాసాహిత్యాలు అభ్యాసం చేశారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలతో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు.
అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కళ్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింప చేసే అభినవ వ్యాస బిరుదును పొందారు. అలాగే టీటీడీ ఆస్థాన పండితులుగా కూడా ఆయన వ్యవహరించారు. మాజీ ప్రధాని పి.వి నరసింహారావుతో సైతం ఆయన సత్కారం అందుకున్నారు. ఇక పురాణాలకు సంబంధించి ఆయన అన్నీ చాలా చమత్కారంతో అందరికి అర్ధం అయ్యేలా చెప్పేవారు. ఎందుకంటే పండితుల బాష పామరులకు సైతం అర్థం అవ్వాలనేది ఆయన ఉద్దేశం.