iDreamPost
android-app
ios-app

మల్కాజిగిరిలో తెరాస బీజేపీ నాయకులు ఎందుకు కొట్టుకున్నారు?

మల్కాజిగిరిలో తెరాస బీజేపీ నాయకులు  ఎందుకు కొట్టుకున్నారు?

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మల్కాజిగిరి నివురుగప్పిన నిప్పులా మారింది. రాజకీయ నేతల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మొదలైన వివాదం మర్నాడు మరింత రాజుకుంది. ఏకంగా కార్లలో రాళ్లు, కర్రలతో టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌కే చేరుకున్నారు. బీజేపీ నేతలపైనే కాకుండా, పోలీస్‌స్టేషన్‌పై కూడా దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌ ముందే బీజేపీ నాయకుల వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. అంతేకాదు.. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఒక్కరోజు చాన్స్‌ ఇస్తే.. బీజేపీ నేతల అంతుచూస్తానంటూ సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగితే పరిస్థితి అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలతో పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పంద్రాగస్టు రోజున బీజేపీ కార్పొరేటర్‌, నేతలపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి నిరసనగా మల్కాజిగిరిలో బంద్‌కు కాషాయ పార్టీ పిలుపు ఇచ్చింది. రాజకీయ నాయకుల ఘర్షణ సామాన్యులపై ప్రభావం చూపింది. బంద్‌ నేపథ్యంలో మల్కాజిగిరిలో మైనంపల్లి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి నేతృత్వంలో హుజురాబాద్‌ కేసీఆర్‌ సభకు బయలుదేరుతున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఉన్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. స్వయంగా ఎమ్మెల్యే మైనంపల్లి టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి స్టేషన్‌లో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు, నాయకులపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో మైనంపల్లి అనుచరులు కార్లలో తెచ్చుకున్న రాళ్ళను పోలీస్‌స్టేషన్‌పైకి రువ్వారు. స్టేషన్‌ ముందున్న బీజేపీ నాయకుల వాహనాలపై గ్రానైట్‌ రాళ్ళు వేసి ధ్వంసం చేశారు.

పోలీసుల సాక్షిగా అధికార పార్టీ నేతల దాడులతో ఆ ప్రాంతం రంణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు, సంబంధంలేని కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసుస్టేషన్‌ ముందున్న ప్రధాన రోడ్డు మొత్తం ట్రాఫిక్‌ జామ్‌ చేసి దాడులకు దిగడంతో స్థానికులు, ప్రయాణికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయాందోళనతో పరుగులు తీశారు. పోలీసుల వద్ద ఉన్న లాఠీలను లాక్కొన్ని మరీ దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. అదనపు బలగాలను రప్పించి పోలీసులు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్గాలను అక్కడ నుంచి పంపించారు. వెళ్తూ కూడా.. ‘మల్కాజిగిరి అంటే మైనంపల్లి.. ఆయనకు ఆడ్డు వస్తే ఇలాగే ఉంటుంది’ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేసుకొంటూ వెళ్లారు.

ఈ ఘటనతో భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు మైనంపల్లిని అరెస్టు చేయాలని నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రామచందర్‌రావు, బీజేపీ నాయకులు నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే అనుచరులను వెంట బెట్టుకొని గుండాయిజం చేయడం దారుణమని మండిపడ్డారు. రౌడీయిజాన్ని బీజేపీ సహించదని, తగిన బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు. ఇంతటితో ఆగకుండా బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రచ్చ గ్రేటర్‌ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.