iDreamPost
iDreamPost
ఈ వారం ఇండిపెండెన్స్ డేకి థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేసేందుకు ఓటిటి రూపంలో బోలెడు ఎంటర్ టైన్మెంట్ రెడీ అవుతోంది. ఈ సందడి 11 నుంచే షురూ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘ది వారియర్’ డిస్నీ హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. డిజాస్టర్ అయినప్పటికీ రామ్ కృతి శెట్టిల జోడి, ఆది పినిశెట్టి విలనీ, దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ సాంగ్స్ కోసం చిన్ని తెరపై ఎంజాయ్ చేసే ప్రేక్షకులు బోలెడు ఉంటారు. అందులోనూ నెల తిరక్కుండానే వస్తోంది. 12న నాగ చైతన్య ‘థాంక్ యు’ని కేవలం ఇరవై ఒక్క రోజులకే అమెజాన్ ప్రైమ్ లో వదలబోతున్నారు. ఫ్లాప్ అయిన ఈ ఫీల్ గుడ్ మూవీకి డిజిటల్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారో!
సాయిపల్లవి టైటిల్ రోల్ పోషించిన ‘గార్గి’కి చాలా ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కానీ విరాటపర్వం కన్నా కొంత మెరుగ్గానే ఆడింది. ఈ నేపథ్యంలో దీన్ని మిస్ చేసుకున్న వాలు ఓటిటి వాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సోనీ లివ్ లో తెలుగుతో పాటు తమిళ మలయాళం వెర్షన్లు అందుబాటులోకి తేనున్నారు. ఆయా ఒరిజినల్ భాషల్లో క్రిటిక్స్ మెప్పు పొందిన ఫహద్ ఫాసిల్ ‘మాలిక్’, విజయ్ సేతుపతి ‘మహామనిషి’ రెండూ ఒకేసారి 12కే ఆహాలో రాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘రాష్ట్ర కవచ్ ఓం’ని జీ5 ద్వారా పదకొండో తేదీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే ప్లాట్ ఫార్మ్ లో కన్నడ మూవీ ‘విండో సీట్’ వస్తుంది.
హాట్ స్టార్ భారీ బడ్జెట్ తో తీసిన వెబ్ సిరీస్ ‘కడవర్’ కూడా పన్నెండుకే స్ట్రీమ్ చేస్తున్నారు. అమలా పాల్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఇతర భాషలు గట్రా చూసుకుంటే ఈ లిస్టు ఇంకా చాంతాడంత అవుతుంది. మొత్తానికి ఓటిటి ఫ్యాన్స్ కి ఇన్నేసి ఆప్షన్లు ఉన్నాయన్న మాట. మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, లాల్ సింగ్ చడ్డాలు వెండితెరపై పోటీ పడుతుండగా ఇక్కడ డిజిటల్ లో వాటికి ధీటుగా అంతకంటే ఎక్కువ నెంబర్లో వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిరీస్ లు రెడీ అవుతున్నాయి.ఒకవైపు వీటి వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదని నిర్మాతలు సీరియస్ డిస్కషన్ లో ఉంటే మరోవైపు ఇంత భారీ స్థాయిలో కొత్త విడుదలలు సిద్ధం కావడం విశేషం