iDreamPost
android-app
ios-app

Ap, Odisha – జాయింట్‌ కమిటీ పరిశీలించే అంశాలు ఇవే..

  • Published Nov 09, 2021 | 2:37 PM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Ap, Odisha – జాయింట్‌ కమిటీ పరిశీలించే అంశాలు ఇవే..

దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాలు.. అయినా పట్టించుకోని పాలకులు. ఫలితంగా రెండు రాష్ట్రాల అన్నదాతలు, సరిహద్దు ప్రాంతాల ప్రజలకు తప్పని ఇబ్బందులు. ఎట్టకేలకు వాటి పరిష్కారానికి ఒక కొత్త ప్రయత్నం మొదలైంది. కీలక ముందడుగు పడింది. మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వేస్తే.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ అడుగులో అడుగు వేశారు. రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాలకు సానుకూల పరిష్కారాలు సాధించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రత్యేక యంత్రాంగంతో కూడిన ఉమ్మడి కమిటీని నియమించాలని నిర్ణయించారు.

ఆత్మీయ చర్చలు

ఒడిశా సీఎంతో చర్చలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ మొదట శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్ అధికారిణి వేదిత వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి విశాఖ వెళ్లి విమానంలో భువనేశ్వర్ చేరుకున్నారు. ఒడిశా సచివాలయంలో జగన్ కు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. మొదట ఇద్దరు సీఎంలు ఏకాంతంగా ఆత్మీయ భేటీ నిర్వహించారు. అనంతరం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, రెవెన్యూ నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఉషారాణి, శ్యామలరావులు పాల్గొన్నారు.

సాగునీటి సమస్యలపై..

ఈ సమావేశంలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నేరడీ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాల భూసేకరణ, ఇదే జిల్లాలో బాహుదా నదిపై ఏపీలో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టుకు నీటి విడుదల అంశం, విజయనగరం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టులో కాంక్రీట్ ఆనకట్ట నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్య, గోదావరి జిల్లాలకు చెందిన పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలపై చర్చించారు. వీటికి ఉమ్మడి చర్చల ద్వారా సానుకూల పరిష్కారాలు సాధించాలని నిర్ణయించారు.

Also Read : Jagan Naveen Patnaik – సీఎం జగన్ ఒడిశా పర్యటన – జల వివాదాలు, సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యం

పలు అంశాలపై చర్చలు, నిర్ణయాలు

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొటియా, ఇతర సరిహద్దు గ్రామాల్లో వివాదాలను సమాఖ్య స్ఫూర్తితో పరిష్కారం కనుగొని.. రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం, స్నేహ సంబంధాలు కాపాడుకోవాలని భావించారు.

-విద్యుత్ రంగానికి సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులైన బలిమెల, ఎగువ సీలేరు విద్యుత్ ప్లాంట్లపై పరస్పరం ఎన్వోసీలు కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

-ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇబ్బందికరంగా ఉన్న మావోయిస్టుల కార్యకలాపాలు, గంజాయి సాగు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

విద్యారంగానికీ పరస్పర సహకారాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మాతృభాషలైన తెలుగు, ఒడియా విద్యార్థుల కోసం శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒడియా పీఠం, ఒడిశాలోని బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పాఠశాలల్లో తెలుగు, ఒడియా మాధ్యమాలు కొనసాగిస్తూ భాషా పండితులను నియమించాలని, ఆయా భాషల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అవసరమైనన్ని సరఫరా చేయడంతోపాటు ఆయా మాధ్యమాల్లోనే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : AP, Odisha, Joint Committee – సమస్యల పరిష్కారానికి ఏపీ, ఒడిశా సీఎంల కీలక నిర్ణయం