iDreamPost
android-app
ios-app

సౌత్ సినిమాపై నెట్ ఫ్లిక్స్ కన్ను

  • Published Jan 16, 2023 | 8:36 PM Updated Updated Jan 16, 2023 | 8:36 PM
సౌత్ సినిమాపై నెట్ ఫ్లిక్స్ కన్ను

ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ లో ఉన్నా ఇండియాలో మాత్రం అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ కున్న రీచ్ తక్కువే. దానికి రెండు కారణాలు. ఒకటి ధర అధికంగా ఉండటం. ఒక నెల చందాతో ఆహా లాంటి యాప్స్ కి ఏడాది సబ్స్క్రిప్షన్ వస్తుంది. రెండోది ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ కంటెంట్ పెట్టడం. అందుకే క్రేజ్ ఎంత ఉన్నా దీని జోలికి వెళ్లే సాహసం డిజిటల్ ఫ్యాన్స్ పెద్దగా చేయరు. గత ఏడాది రెవిన్యూ చూసుకుని హడలెత్తిపోయిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు మొదటి అంశం మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా సినిమాలంటే విపరీతంగా పడిచచ్చిపోయే సౌత్ ఆడియన్స్ మీద ఫోకస్ పెంచి వందల కోట్లతో క్రేజీ సినిమాల హక్కులు కొనేస్తోంది

అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న వాటిని, ప్రకటనలు ఇచ్చిన వాటికి భారీ మొత్తం ఇచ్చి కొనేసుకుంటోంది. భోళా శంకర్, మహేష్ బాబు 28. అమిగోస్, మీటర్, దసరా, టిల్లు 2, విరూపాక్ష ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా పదిహేడు సినిమాలను లైన్ లో పెట్టేసింది. వీటి థియేట్రికల్ రన్ పూర్తి కాగానే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తాయి. తమిళంలోనూ ఇదే దూకుడు చూపిస్తోంది. జిగర్ తండా 2, మామన్నన్, జపాన్, ఇరుగపాత్రు, ఇరైవన్, చంద్రముఖి 2, ఆర్యన్, అజిత్ 62 ఇవన్నీ పోటీపడి మరీ కొనేసుకుంది. ఇంకా లిస్టులో రావాల్సినవి చాలా ఉన్నాయట. వీటి మీద ఎంతలేదన్నా వెయ్యి కోట్లకు పైగానే పెట్టుబడి ఉండొచ్చని ఓటిటి వర్గాల కథనం.

ఇక్కడి మార్కెట్ లో నెట్ ఫ్లిక్స్ వేసిన ప్లాన్ భారీగా ఉంది. ఆ మధ్య ఓటిటికి థియేటర్ కు గ్యాప్ ఉండాలని గట్టి స్వరం వినిపించిన నిర్మాతలు వాస్తవంగా మాత్రం దానికి పూర్తి భిన్నంగా వెళ్తున్నారు. నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లో ఈ మధ్య స్ట్రీమింగ్ అయిన కొత్త సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో ఇలా సెట్ల మీద ఉండగానే అనౌన్స్ మెంట్లు ఇస్తే రేపు రిలీజ్ టైంలో ఎలాగూ ఓటిటిలో వస్తాయని ఆడియన్స్ లైట్ తీసుకుంటే దానికి బాద్యులు ఎవరు. స్టార్ హీరోలకు తప్ప మీడియం రేంజ్ హీరోలకు జనాన్ని ఫుల్ చేయడం కష్టంగా మారిపోతున్న తరుణంలో ఓటిటిలు అనుసరిస్తున్న ఇలాంటి ఎత్తుగడల వల్ల కంపనీలకు లాభమేమో కానీ పరిశ్రమకు కాదు