Idream media
Idream media
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.
బదిలీ వేటు పడినందుకేనా?
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద వాహనంలో బాంబు కేసులో ఇప్పటికే సీనియర్ పోలీసు అధికారి వాజేను అరెస్టు చేశారు. మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ ను అప్రాధాన్య శాఖ హోంగార్డు విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా ఆయనపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అందుకే తాజాగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని హోం శాఖ మంత్రి వెల్లడించారు.
ఫిబ్రవరిలోనే వాజే అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చినా పరంబీర్ ఎందుకు స్పందించలేదని మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రశ్నించారు. దీని పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. వ్యాపారి మాన్సుక్ హత్య, ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు విషయంలో ఇప్పటికే వాజేకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక పరంబీర్ పై కూడా చర్యలకు రంగం సిద్ధం చేశారు. అందుకే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.
Also Read:అంబానీ ఇంటివద్ద కారు వెనుక ఆ పోలీస్ అధికారి పాత్ర ఏమిటి?
ఆధారాలు ఉన్నాయా..?
ఒక పోలీస్ అధికారి సాక్షాత్తు రాష్ట్ర హోం శాఖ మంత్రి పైనే ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా చూపించాలనేది ఆ పోలీస్ అధికారికి తెలియంది కాదు. కానీ ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ఆయన అందులో ఆధారాలకు సంబంధించి ఎక్కడ ప్రస్తావించినట్లు కనిపించడం లేదు. కేవలం ఆరోపణలనే కనిపించడం గమనార్హం.
నెలకు వంద కోట్లా?
నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ ఆరోపించారు. ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారని పేర్కొన్నారు. అనిల్ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పారనేది ప్రధాన ఆరోపణ.
ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, హోటల్లు తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయని, ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారని లేఖలో పేర్కొన్నారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారని లేఖలో రాసారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు.
Also Read:పీవీ కుమార్తెదే గెలుపు
ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్ హవేలీ ఎంపీ మెహన్ దేల్కర్ తన సూసైడ్ నోట్‌లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్ సింగ్ తప్పుబట్టారు.
మంత్రి దేశ్‌ముఖ్ ఏమన్నారు?
అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయన్నారు.