iDreamPost
iDreamPost
మహారాష్ట్రలో పతనం అంచుకెళ్లిన థాకరే ప్రభుత్వాన్ని కూల్చడానికి, బీజేపీ త్వపడటంలేదు. రాత్రికి రాత్రి దెబ్బతీద్దామనుకున్న రాజస్థాన్ లో సచిన పైలెట్ తిరుగుబాటు విఫలమైంది. అందుకే వెయిట్ చేద్దామనే చూస్తోంది. తొందరపాటు వద్దు. ఏక్ నాథ్ షిండే వెంట నిజంగా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాతే, ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్. అంతెందుకు గవర్నర్ దన్నుఉన్నా, ఎమ్మెల్యేలను సమీకరించలేక, 2019లో దేవేంద్ర ఫడ్నవీస్, ముచ్చటగా మూడు రోజుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆనాడు పరువుపోయింది. అందుకే బీజేపీ జాగ్రత్తగా ప్లాన్ వేస్తోంది.
మహా వికాస్ అఘాడి (MVA)కి నేతృత్వం వహిస్తున్న శివసేనకున్న ఎమ్మెల్యేలు 55 మంది. ఇందులో 45 మంది మద్దతు తనకు ఉందన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో, థాకరే సర్కార్ సంక్షోభంలో పడింది.
వేటుపడటానికి ముందు, షిండే మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. డజనుకు పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. అక్కడ నుంచి అస్సోంలోని గౌహతికి మకాం మార్చారు. అక్కడ నుంచే కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ వేస్తున్నారు.
రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో కూటమికి ఎదురుదెబ్బ తగిలినప్పుడే, వెనుక నుంచి ఏదో జరుగుతోందని సేనకు అర్ధమైంది. క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరు? ఎవరు బీజేపీ వెంటనడుస్తున్నారు? నిఘావిభాగం నుంచి సమచారం తెప్పించుకొని, నష్టనివారణ చర్యలు తీసుకొనేలోగానే, షిండే తిరుగుబాటు చేశారు. ఇప్పుడు నాలుగింట మూడింతల ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లే. అంటే ప్రభుత్వమేకాదు, పార్టీ మనుగడ ప్రమాదంలో పడినట్లే.
ఎదురుగా మహాప్రభుత్వ పేకమేడలా కుప్పకూలే అవకాశం కనిపిస్తున్నా, బీజేపీ నాయకత్వం జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తోంది. గట్టి దెబ్బతీయడానికి అన్ని అవకాశాలను బేరేజు వేసుకొంటోంది. షిండే వెంట నడిచే ఎమ్మెల్యేల లెక్క పూర్తిగా తేలిన తర్వాతనే బలపరీక్షకు సిద్ధమవుతుంది.
షిండేకు మద్దతునిచ్చేది 45 మంది. మరికొంతమందికి అతని వద్దకు పంపించే ఎర్పాట్లు చేస్తున్నారు. బహుశా కొద్దిరోజుల్లోనే క్లారిటీ రావచ్చు. ప్రస్తుతం బీజేపీ పంజాకు దొరక్కుండా తప్పించేందుకు శివసేన పోరాటం చేస్తోంది. అది తనంతటతానే కుప్పకూలిపే వరకు బీజేపీ ఎదురుచూడవచ్చు.