iDreamPost
android-app
ios-app

మాజీ సీఎం చంద్రబాబు బాటలో తాజా సీఎం..!

మాజీ సీఎం చంద్రబాబు బాటలో తాజా సీఎం..!

పరిపాలనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకున్నారా..? అంటే ఆయన చర్యల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఉద్ధవ్‌ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనియాంశమైంది. మహారాష్ట్రలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఉద్ధవ్‌ ఠాక్రే. మహారాష్ట్రలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉద్ధవ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇటీవల మహారాష్ట్రలో టీఆర్‌పీ కుంభకోణం వెలుగుచూసింది. పలు టీవీ ఛానెళ్లు తమ టీఆర్‌పీల కోసం ట్యాంపరింగ్‌ చేశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నిలిస్ట్, న్యూస్‌ ప్రజెంటర్‌ అయిన అర్నబ్‌ గోస్వామికి చెందిన రిపబ్లిక్‌ టీవీపై కూడా ఆరోపణలు వచ్చాయి. టీఆర్‌పీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ సమయంలో సీబీఐకి ఉద్ధవ్‌ ఠాక్రే నో ఎంట్రీ బోర్డు పెట్టడం విశేషం.

ఉద్ధవ్‌ ఠాక్రే తీసుకున్న నిర్ణయంతో అందరికీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న చర్యను గుర్తు చేసింది. 2018లో టీడీపీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకు రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఇచ్చిన సాధారణ సమ్మతిని చంద్రబాబు ఉపసంహరించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలేనిదే రాష్ట్రంలో విచారణకు అవకాశంలేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, ఓటుకు నోటు కేసుల నేపథ్యంలో తమపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందన్న భయంతో నాడు బాబు ఆ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరిగింది. నాడు బాబు నడిచిన బాటలోనే నేడు ఉద్ధవ్‌ ఠాక్రే కూడా నడవడం గమనార్హం.