iDreamPost
android-app
ios-app

మహానాడుకు మాత్రమే మినహాయింపా..?

మహానాడుకు మాత్రమే మినహాయింపా..?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలు పరిశీలించే వారికి కూడా ఆయన రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావు. తాజాగా జరిగిన జూమ్‌ మహానాడు రెండో రోజు పది తీర్మానాలు చేశారు. అందులో నాలుగు ఏపీకి చెందినవి కాగా.. మూడు తెలంగాణకు, మరో మూడు ఉమ్మడి తీర్మానాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య– ఉపాధి అవకాశాలు – పరిశ్రమల మూసివేత – కుదేలైన విద్యారంగం, కొరవడిన మహిళా వికాశం.. అనే అంశాలపై తీర్మానాలు చేశారు.

తెలంగాణలో నిరుద్యోగ, ఉపాది అంశం ప్రధాన సమస్యగా ఉంది. కరోనా కారణంగా విద్యారంగం కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఇంతటి ముఖ్యమైన సమస్యలపై మహానాడులో తీర్మానం చేయడం, చర్చించడం చెప్పుకొదగిన అంశం. అయితే ఈ అంశాలు మహానాడు జరిగిన సమయంలోనే ప్రస్తావనకు రావడం, ఆ తర్వాత తెలంగాణ వైపు టీడీపీ అధినేత కన్నేత్తి కూడా చూడకపోవడం బాబు శైలి రాజకీయమని చెప్పవచ్చు.

2015లో వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు ఉన్నఫళంగా హైదరాబాద్‌ను వదిలి విజయవాడకు వచ్చారు. చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడన్న కేసీఆర్‌ హెచ్చరించినా.. ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకూడదనే షరతులతో కేసీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య రాజీ కుదరిందనే ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా గత ఆరేళ్లుగా చంద్రబాబు రాజకీయాలు సాగించారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు కూడా పెట్టలేదు. ఏ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకోలేదు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా.. ఏ నాడు తెలంగాణ సమస్యలను ప్రస్తావించలేదు.

అయితే ఏడాది పొడవునా తెలంగాణ రాజకీయ అంశాలను మాట మాత్రమైనా ప్రస్తావించని చంద్రబాబు.. మహానాడులో మాత్రం ఆ రాష్ట్ర అంశాలపై తీర్మానం చేయడమే ఇక్కడ గమనించాల్సిన అంశం. బాబు తీరును చూసిన వారు.. తెలంగాణ రాజకీయాలు మహనాడుకు మాత్రమే మినహాయింపు ఇచ్చిరా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కొన్ని జిల్లాల్లో టీడీపీ జెండా మాయం?