Idream media
Idream media
మహానాడు అంటే టీడీపీకి పెద్ద పండగ లాంటిది. ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28న తెలుగు రాష్ట్రాల్లో మహానాడును పార్టీ పండుగలా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులు నిర్వహించేవారు. అధికారంలో ఉన్నప్పుడు అయితే, అది జరిపే తీరే వేరేలా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని పార్టీ ప్రకాశానికి దోహపడేలా మార్చుకునే వారు. దూరం అయిన నేతల్ని, పార్టీకి దూరం అవుతారన్న అనుమానం ఉన్న వాళ్లని ఈ మహానాడు వేదిక ద్వారా మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ , కరోనా మొదటి దశ విజృంభణతో గతేడాది మహానాడు ఆన్ లైన్ కే పరిమితం అయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం సన్నగిలింది. ఈసారైనా ఘనంగా నిర్వహించి పార్టీలో మళ్లీ జోష్ నింపే ప్రయత్నం చేయాలని ముఖ్య నాయకులందరూ ఆశలు పెట్టుకోగా, ఇప్పుడు కూడా ఆన్‌లైన్ కే పరిమితం అయింది.
కరోనా కారణంగా నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ వదిలి రావడానికే దాదాపు ఇష్ట పడడం లేదు. సమావేశాలు, ముఖ్యులతో మంతనాలు అన్నీ ఫోన్లు, ఆన్ లైన్ మీటింగ్ ద్వారానే జరుగుతోంది. చివరకు అసెంబ్లీకి సమావేశాలకు కూడా హాజరుకాలేదు. మాక్ అసెంబ్లీ పేరుతో అది కూడా ఆన్ లైన్ లోనే కానిచ్చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కూడా ఆన్ లైన్ కే పరిమితమవుతోంది. పోయిన సారి కరోనాతో.. ఈసారి సెకండ్ వేవ్ తో ఈ పండుగ కేవలం ఆన్ లైన్ లోనే వర్చువల్ గా కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా టీడీపీ అదినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈనెలలో జరిగే మహానాడు కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు ఈనెల 27 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించడానికి ఆమోదం తెలిపారు.
మే 28వ తేదీన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం జరుపుతూనే ఉన్నారు. ఏదైనా తుఫాన్ ప్రకృతి వైపరీత్యాల్లోనే మహానాడును నిర్వహించలేదు. కానీ కరోనాతో 2019 తర్వాత కరోనాతో వరుసగా రెండో ఏడాది కూడా మహానాడును నిర్వహించలేకపోతున్నారు. ఏడాదంతా ఎలాగున్నా, ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలను అందరినీ సమీకరించేది టీడీపీ. కానీ, ఆ అవకాశం కూడా కరోనా కారణంగా దక్కడం లేదు. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లా బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి ఇతర నేతల అరెస్ట్ ను పొలిట్ బ్యూరో ఖండించింది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తుందని పొలిట్ బ్యూరో ఈ సందర్భంగా అభిప్రాయపడింది.