iDreamPost
android-app
ios-app

నవ్విపోదురుగాక మాకేటి..?

నవ్విపోదురుగాక మాకేటి..?

నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. ప్రజలు ఏమనుకుంటారో అన్న కనీస సృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. మహానాడులో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ‘‘అన్నదాత వెన్ను విరిచిన జగన్‌ సర్కార్‌’’ అనే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో ‘ప్రభుత్వాలు నిరంతరం ఉంటాయి. గత ప్రభుత్వాల విధానాలను ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు‘ అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకీ ఆ విధానాలు ఏమిటయ్యా.. అంటే రైతు రుణాలు మాఫీ చేస్తామన్న టీడీపీ హామీని వైసీపీ సర్కార్‌ పూర్తి చేయడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ రెండు విడదతల బకాయిలు రూ.7,500 కోట్ల రూపాయలు చెల్లిస్తామంటూ తీర్మానం చేశారు.

రాజకీయ పార్టీలు తన ఎన్నికల మేనిఫెస్టోలను ఎన్నికల ముందు ప్రకటించడం ఆనవాయితీ. మేము అధికారంలోకి వస్తే.. ఇవన్నీ చేస్తామని చెబుతారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ ప్రభుత్వం ఐదేళ్లు పాటు ఉంటుంది. ఆ సమయంలో హామీలు పూర్తి చేశారు. అంతేగానీ మళ్లీ వస్తే ఇస్తాం.. ఈ సారి వచ్చే పార్టీ ప్రభుత్వం మా హామీలు అమలు చేయాలనే వింత వాదన బహుసా దేశ చరిత్రలో ఇదే తొలిసారి అయింటుంది.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణాలు మాఫీ హామీ. 87,672 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రతి సభలోనూ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. బ్యాంకుల్లోని బంగారం బయటకు రావాలంటే.. బాబు రావాలి.. అనే నినాదాలతో హోరెత్తించారు. భేషరతుగా పంట రుణాలు, పంటపై తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తామన్న విషయం ఇప్పటికీ అన్నదాతలు మరచిపోలేదు. అప్పులు బకాయలుగా పేరుకుపోవడంతో ఇప్పటికీ రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి.

ఇచ్చిన హామీని అమలు చేశారా..? అంటే భేషరతుగా రుణమాఫీ అన్న చంద్రబాబు, కోటయ్య కమిటీ వేసి కోతలు విధించారు. బంగారు రుణాలను కొండెక్కించారు. ఒక్కొక్కరికి గరీష్టంగా 1.50 లక్షల వరకూ మాఫీ చేస్తామంటూ 87,672 కోట్ల రుణాలను 18,750 కోట్లకు కుదించారు. సరే అదన్నా చేశారా.. ఐదు దఫాలుగా వేస్తామన్నారు. ఏడాదికి 3,750 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఆ నగదు వడ్డీలకు కూడా సరిపోదనేది మరో విషయం. సరే చేస్తామన్న ఆ పనైనా చేశారా.. ఐదేళ్లలో మూడు దఫాలు 3,750 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చి.. ఎన్నికలకు ముందు రెండు దఫాలు ఒకేసారి విడుదల చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. అప్పటికే ఎన్నికల కోడ్‌ వచ్చేసింది.

తన హామీలపై ఎక్కడ చిత్తశుద్ధితో వ్యవహరించని బాబుకు, ఆయన పార్టీకి రైతులే తగిన గుణపాఠం చెప్పారు. కలుపుమొక్కలను పీకిపారేసినట్లు ఏరిపారేశారు. తాము చేసింది ఏదో గొప్ప పని అన్నట్లుగా.. తమ హామీ అమలులో భాగంగా పెండింగ్‌లో ఉన్న రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు వైసీపీ సర్కార్‌ చెల్లించాలంటూ తీర్మానాలు చేస్తున్నారంటే.. ఇంతకంటే విడ్డూరం మరొకటి ఉండదనడంలో సందేహం లేదు.