iDreamPost
android-app
ios-app

గెలిచిన ఉద్ధవ్‌

గెలిచిన  ఉద్ధవ్‌

శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు అసెంబ్లీలో కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145 కాగా.. ఉద్ధవ్‌ సర్కార్‌కు 169 ఓట్లు వచ్చాయి.

స్పీకర్‌ దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ హెడ్‌కౌంట్‌కు ఆదేశించగా.. భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. విధాన సభ ప్రారంభం కాగానే తొలుత సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన కేబినెట్‌ మంత్రులను సభకు పరిచయం చేయుటజరిగింది. అనంతరం మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్‌ నియామకం చట్టవిరుద్ధమని వాగ్వాదానికి దిగారు. సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం నియమ నిబంధనలకు లోబడి జరగలేదన్నారు. విశ్వాస పరీక్షకు ముందు ప్రొటెం స్పీకర్‌ను మార్చడంపై వాగ్వాదానికి దిగి అభ్యంతరం వ్యక్తంచేశారు. స్పీకర్‌ ఎన్నిక జరగకుండా విశ్వాస పరీక్ష అలా చేస్తారని వాదించారు.

విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ తెలిపారు. తనను గవర్నరే నియమించారని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితులలో విశ్వాస పరీక్ష నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. దీంతో భాజపా ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యుడు అశోక్‌ చవాన్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రొటెం స్పీకర్‌ హెడ్‌ కౌంట్‌కు ఆదేశించారు. ఈ క్రమంలో భాజపా సభాపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్‌ చేశారు. సభ్యులంతా శాంతించి తమ సీట్లలో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా భాజపా ఎమ్మెల్యేలు శాంతిం చకపోవడంతో సభ తలుపులు మూసివేసి హెడ్‌కౌంట్‌ చేపట్టాలని ప్రొటెం స్పీకర్‌ ఆదేశించారు. ఈ విశ్వాస పరీక్షలో మహా వికాస్‌ అఘాడీ కూటమి మొత్తం 169 ఓట్లు పొంది విశ్వాస పరీక్షలో ఉద్ధవ్‌ఠాక్రే సేన తమ బలాన్ని నిరూపించుకుంది.